తెలంగాణ చరిత్రలో  ఖేలో ఇండియా గేమ్స్ మైలురాయి..మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం

తెలంగాణ చరిత్రలో  ఖేలో ఇండియా గేమ్స్ మైలురాయి..మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం
  • క్రీడల నిర్వహణకు రూ.203.13 కోట్ల బడ్జెట్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ క్రీడా చరిత్రలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 ఒక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఈ గేమ్స్ నిర్వహణ కోసం తెలంగాణను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సంబరాలకు ప్రధాని మోదీని ఆహ్వానించామని, ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ఆదివారం ఢిల్లీలో మంత్రి ఉత్తమ్‌‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.21 కోట్లకు అదనంగా రాష్ట్రం రూ.203.13 కోట్లు కేటాయించిందని తెలిపారు.

ఈ నిధులను క్రీడల నిర్వహణతోపాటు, రాష్ట్రంలోని స్టేడియాల్లో శాశ్వత మౌలిక వసతుల కల్పనకు వినియోగిస్తామని వివరించారు. ఈ గేమ్స్‌‌లో మొత్తం 27 క్రీడాంశాలు ఉంటాయని, తెలంగాణ సంప్రదాయ క్రీడ అయిన కర్రసామును కూడా ఇందులో చేర్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 7 వేల మందికి పైగా క్రీడాకారులతోపాటు సుమారు 1,200 మంది కోచ్‌‌లు, సహాయక సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. హైదరాబాద్‌‌తోపాటు హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌‌నగర్ జిల్లాల్లో ఈ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

సీఎం నినాదంతో...

సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ‘మత్తు వదలండి.. మైదానాలు చేరండి’ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నామని మంత్రి తెలిపారు. ప్రధాని మోదీ చేపట్టిన ‘నషా ముక్త్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి, క్రీడల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రాన్ని క్రీడా రంగంలో మరింత అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.