ఈ వారం స్టాక్ మార్కెట్..ఎఫ్‌ఐఐల పెట్టుబడులపై ఇన్వెస్టర్ల చూపు!

ఈ వారం స్టాక్ మార్కెట్..ఎఫ్‌ఐఐల పెట్టుబడులపై ఇన్వెస్టర్ల చూపు!
  • ఈ వారం ఎఫ్‌‌‌‌ఐఐలపై ఇన్వెస్టర్ల ఫోకస్‌‌‌‌ 
  • గత 9 సెషన్లలో రూ.84 వేల కోట్ల విలువైన షేర్లు కొన్న విదేశీ ఇన్వెస్టర్లు 

ముంబై: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల డైరెక్షన్‌‌‌‌ను హోల్‌‌‌‌సేల్‌‌‌‌ ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) డేటా, విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌‌‌‌పీఐ/ఎఫ్‌‌‌‌ఐఐల) పెట్టుబడులు, ముడి చమురు ధరలు, పశ్చిమాసియా పరిణామాలు నిర్ణయిస్తాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.  అంతర్జాతీయంగా అమెరికా రిటైల్ అమ్మకాలు, ఎన్విడియా సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు, ఫెడ్  మీటింగ్ మినిట్స్ కూడా మార్కెట్ సెంటిమెంట్‌‌‌‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. గత వారం సెన్సెక్స్ 564 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 114 పాయింట్లు లాభపడి 25 వేల మార్కును దాటింది.

భారీగా కొనుగోళ్లు

వరుసగా రెండు నెలల అమ్మకాల తర్వాత విదేశీ పోర్ట్‌‌‌‌ఫోలియో ఇన్వెస్టర్లు  నవంబర్ మొదటి 15 రోజుల్లోనే (నవంబర్ 2–13) భారత ఈక్విటీల్లో ఏకంగా రూ. 84,290 కోట్లు కుమ్మరించారు. వీరు సెప్టెంబర్‌‌‌‌లో రూ. 35,861 కోట్లు, అక్టోబర్‌‌‌‌లో రూ. 34,843 కోట్ల షేర్లు అమ్మారు. తాజా కొనుగోళ్లతో ఈ ఏడాది ఎఫ్‌‌ఐఐలు అమ్మిన  మొత్తం  షేర్ల నికర విలువ రూ. 3 లక్షల కోట్ల నుంచి రూ. 2.1 లక్షల కోట్లకు తగ్గింది. గ్లోబల్ ఏఐ  షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా ఇన్వెస్టర్లు ఇండియాలోని లార్జ్-క్యాప్ షేర్ల వైపు చూస్తున్నారు.  

మరోవైపు బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌‌‌‌కు 97 డాలర్ల వద్దకు దిగిరావడం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, టెలికాం, ఆటో, ఫార్మా రంగాల్లో షార్ట్-కవరింగ్, బలమైన క్యూ2 ఫలితాలు నమోదవడం మార్కెట్లను నడిపిస్తున్నాయి. అయితే, అమెరికా బాండ్ ఈల్డ్స్ 5శాతం పైన కొనసాగడం, ఆర్బీఐ డిసెంబర్ పాలసీ అంచనాలు, డాలర్ కదలికల పట్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.