బషీర్‌బాగ్, వెలుగు : ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్యపై వస్తున్న ఆరోపణల వెనుక కార్పొరేట్ శక్తుల కుట్ర దాగి ఉందని బీసీ పొలిటికల్ ఫ్రంట్, గౌడ సంఘాల నాయకులు ఆరోపించారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న జానయ్యను పదవి నుంచి తొలగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్లు అయిలి వెంకన్న గౌడ్, ఎలికట్టె విజయ్‌కుమార్ గౌడ్, బైరి శేఖర్, ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్. దుర్గయ్య గౌడ్ మాట్లాడారు. అయిలి వెంకన్న గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ విత్తన పరిశోధనలకు ప్రాధాన్యమిస్తూ, ప్రైవేటు విత్తన కంపెనీల ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేస్తున్నందునే ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు
. జానయ్యపై ఆరోపణలు చేస్తున్న వారు వాటికి సంబంధించిన ఆధారాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఎంబీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బడే సాబ్, బీసీ రచయితల సంఘం నాయకుడు డాక్టర్ ఆర్. శ్రీనివాస్, అమరవీరుల రాష్ట్ర సమితి అధ్యక్షుడు సాయికుమార్, రాజు యాదవ్ పాల్గొన్నారు.
