ఎల్ నినో ఫస్ట్ ఎఫెక్ట్.. 500 కోట్ల జీఎస్టీ లాస్!

  ఎల్ నినో ఫస్ట్ ఎఫెక్ట్..  500 కోట్ల జీఎస్టీ లాస్!
  • ప్రభుత్వానికి కమర్షియల్ ట్యాక్స్ నివేదిక
  • నవంబర్, డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో ఇంకా తగ్గే చాన్స్ 
  • పంటల దిగుబడి తగ్గడంతో రాబడిపై ఎఫెక్ట్​
  • వేరే మార్గాల నుంచి గ్యాప్ పూడ్చడంపై దృష్టి

హైదరాబాద్, వెలుగు: ఎల్‌‌‌‌నినో ప్రభావం, కరువు రాష్ట్ర ఖజానాపై పడబోతోందని కమర్షియల్ ట్యాక్స్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఎల్‌‌‌‌నినోతో ఈ నవంబర్, డిసెంబర్ నెలల్లో రాష్ట్ర జీఎస్టీ రాబడిలో కనీసం రూ.500 కోట్ల మేర లోటు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా రాష్ట్రంలో కీలక పంటలైన వరి, పత్తి, మిర్చి దిగుబడులపై వాతావరణ ప్రతికూలతలు ప్రభావం చూపడంతో, ఆ పంటల రవాణా (ట్రాన్స్‌‌‌‌పోర్ట్) ప్రాసెసింగ్ కార్యకలాపాలు మందగించడమే ఇందుకు ప్రధాన కారణమని తేల్చారు. 

వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు తగ్గిపోవడంతో ఈ నెల నుంచే పన్నుల వసూళ్లపై ప్రభావం పడుతుందని, తద్వారా అనుకున్న స్థాయిలో ఆదాయం వచ్చే పరిస్థితి లేదని నివేదికలో పేర్కొన్నారు. సాధారణంగా పంటలు చేతికి వచ్చే ఈ సీజన్‌‌‌‌లో మార్కెట్ యార్డులు, మిల్లులు, జిన్నింగ్ కేంద్రాలు, రవాణా రంగం ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున పన్నుల రూపంలో రాబడి సమకూరుతుంటుంది. కానీ ఎల్‌‌‌‌నినో కారణంగా పంటల దిగుబడులు, మార్కెట్ కదలికలు తగ్గుముఖం పట్టడం నేరుగా వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి గండికొడుతోందని అధికారులు వివరించారు. ఈ పరిణామంతో రాష్ట్ర ఆర్థిక శాఖ అప్రమత్తమై, బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా నిధులను సమీకరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం ప్రారంభించింది.

పన్నులు రాకపోతే బడ్జెట్ కేటాయింపులు కష్టమే..

ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నాటికి ముగిసిన తొలి 7 నెలల కాలంలో కమర్షియల్ ట్యాక్స్ శాఖ రూ.52,113 కోట్ల భారీ రాబడిని సాధించి అత్యుత్తమ పనితీరు కనబరిచింది. ముఖ్యంగా జీఎస్టీ వసూళ్లలో ఏకంగా 17% వృద్ధి రేటుతో దూకుడు ప్రదర్శించడంతో పాటు ఒక్క అక్టోబర్‌‌‌‌లోనే జీఎస్టీ కింద రూ.4,593 కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ అయింది. ఏడు నెలలుగా పన్నుల వసూళ్లలో కనబరిచిన ఈ స్థిరమైన వృద్ధి రేటుతో ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను సులభంగా అధిగమిస్తామని అధికారులు భావించారు. 

అయితే, ఎల్‌‌నినో రూపంలో పన్నుల వసూళ్ల వేగానికి బ్రేక్ పడటం ఆర్థిక నిపుణులను, అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి ఆశించిన మేర పన్నులు రాకపోతే బడ్జెట్ కేటాయింపులు, సంక్షేమ పథకాల అమలుకు నిధుల సర్దుబాటు కష్టతరమయ్యే చాన్స్​ ఉందని నివేదిక హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ వరకు కొనసాగిన 17% వృద్ధి జోరు ఏ మాత్రం తగ్గకుండా చూసుకోవడం వాణిజ్య పన్నుల శాఖ సవాలుగా మారింది.

వ్యవసాయేతర రంగాలపై ఫోకస్‌‌.. 

నవంబర్, డిసెంబర్​లో ఏర్పడబోయే రూ.500 కోట్ల రెవెన్యూ గ్యాప్‌‌ను పూడ్చుకునేందుకు ఇతర మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా సేవా రంగం, తయారీ, ఐటీ, రియల్ ఎస్టేట్, వాణిజ్య కార్యకలాపాల ద్వారా వచ్చే పన్నుల వసూళ్లపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. పన్ను ఎగవేతల నిరోధక చర్యలను ముమ్మరం చేయడంతో పాటు దీర్ఘకాలంగా పేరుకుపోయిన పెండింగ్ బకాయిల రికవరీపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. 

డేటా అనలిటిక్స్ సాయంతో పన్ను చెల్లింపుల్లో తేడాలు ఉన్న వ్యాపార సంస్థలను గుర్తించి నోటీసులు జారీ చేయడం, తనిఖీలను వేగవంతం చేయడం ద్వారా లోటును భర్తీ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎల్‌‌నినో వంటి ప్రకృతి వైపరీత్యాలతో వ్యవసాయ, అనుబంధ రంగాలతో వచ్చే ఆదాయం తగ్గినప్పటికీ, పక్కా ప్రణాళికలతో ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.