మరింత ఈజీగా కార్ రెంట్ బిజినెస్‌‌‌‌!..మొదలు పెట్టడానికి 5 కార్లు చాలు

మరింత ఈజీగా కార్ రెంట్ బిజినెస్‌‌‌‌!..మొదలు పెట్టడానికి 5 కార్లు చాలు
  • ఒక రాష్ట్రంలోని అన్ని లొకేషన్లకు  ఒకే లైసెన్స్‌‌‌‌
  • 60 రోజుల్లోగా అధికారులు  లైసెన్స్ ఇవ్వాలి
  • కస్టమర్ల సేఫ్టీకి కొత్త నిబంధనలు
  •  ‘రెంట్ ఏ క్యాబ్’ స్కీమ్ డ్రాఫ్ట్‌‌‌‌ ప్రకటించిన ప్రభుత్వం  

న్యూఢిల్లీ:  కార్లను రెంటుకు ఇచ్చే బిజినెస్‌‌‌‌ను  ప్రారంభించాలనుకునే చిన్న సంస్థలకు కేంద్ర ప్రభుత్వం  త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇప్పటివరకు ఈ వ్యాపారం మొదలుపెట్టాలంటే కనీసం 50 కార్లు ఉండాలనే నిబంధన ఉండగా, దానిని కేవలం 5 కార్లకు తగ్గిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ  'రెంట్-ఏ-క్యాబ్ స్కీమ్ 2026' డ్రాఫ్ట్‌‌‌‌ను  రూపొందించింది. 1989 నాటి పాత నిబంధనల స్థానంలో రానున్న ఈ కొత్త డ్రాఫ్ట్‌‌పై డిసెంబర్ 5, 2026 వరకు ప్రజాభిప్రాయాలు, సూచనలను ఆహ్వానించింది. జనవరి 1, 2027 నుంచి దీనిని అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. డ్రైవర్‌‌‌‌తో పాటు లేదా సెల్ఫ్-డ్రైవ్ కార్ల అద్దెకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.

రూల్స్‌‌‌‌లో మార్పు  

ఐదు కార్లతోనే వ్యాపారం: దరఖాస్తుదారుడి పేరు మీద రిజిస్టర్ అయిన 5 కార్లు ఉంటే చాలు. తక్కువ పెట్టుబడితోనే ఈ వ్యాపారం మొదలుపెట్టొచ్చు. అయితే ప్రతి ఆపరేటింగ్ లొకేషన్‌‌‌‌లో కనీసం రెండు కార్లు ఉండాలి. ఐదు పర్యాటక నగరాల్లో శాఖలు ఉండాలనే పాత నిబంధనను పూర్తిగా తొలగించారు. ఎయిర్‌‌‌‌పోర్ట్స్‌‌, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, బస్ టెర్మినల్స్ వద్ద కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది.

ఒకే లైసెన్స్, తక్కువ ఫీజు: ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని అన్ని లొకేషన్లకు కలిపి ఒకే ఎలక్ట్రానిక్ దరఖాస్తు సరిపోతుంది. కార్ల సంఖ్య, లొకేషన్లతో సంబంధం లేకుండా రూ. 25 వేల ఫీజుతో 5 ఏళ్ల కాలపరిమితి గల లైసెన్స్ పొందొచ్చు.

వేగవంతమైన అనుమతులు: దరఖాస్తు చేసిన 60 రోజుల్లోగా అధికారులు పరిశీలించి లైసెన్స్ జారీ చేయాలి. కొత్త కార్లు లేదా లొకేషన్లను చేర్చుకోవడానికి దరఖాస్తు చేస్తే, 30 రోజుల్లోగా అధికారులు స్పందించకపోతే దానికి ఆమోదం లభించినట్లే.

భద్రతకు పెద్దపీట

24/7 కస్టమర్ కేర్ : అద్దె సంస్థలు 24 గంటలూ పనిచేసే కాల్ సెంటర్‌‌‌‌ను ఏర్పాటు చేసి, ఆ వివరాలను వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఉంచాలి. ఆన్‌‌‌‌లైన్ ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించాలి. డ్రైవర్ ప్రవర్తన లేదా నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదు వస్తే 7 రోజుల్లోగా విచారణ జరిపి, కస్టమర్‌‌‌‌కు వివరాలు తెలిపి చర్యలు తీసుకోవాలి.
బ్రేక్‌‌‌‌డౌన్ సాయం: ప్రయాణం మధ్యలో కారు చెడిపోతే మరమ్మతులు లేదా టోయింగ్ సదుపాయాన్ని కార్లను అద్దెకు ఇచ్చిన సంస్థే కల్పించాలి. అద్దెకు ఇచ్చే కారు రిజిస్ట్రేషన్ అయి 9 ఏళ్ల లోపుదై ఉండాలి. వాహనానికి ఫిట్‌‌‌‌నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్లతో పాటు ప్రయాణికులందరికీ ఇన్సూరెన్స్ అందివ్వాలి.

భద్రతా ప్రమాణాలు: కారులో జీపీఎస్ ట్రాకర్, ఫస్ట్-ఎయిడ్ కిట్ తప్పనిసరి. పిల్లలతో ప్రయాణించే కుటుంబాల కోసం కనీసం ఒక సీటులో చైల్డ్ సీటు అమర్చే వీలుండాలి, కస్టమర్‌‌‌‌ అడిగితే సంస్థే అందించాలి. డ్రైవర్లకు పోలీస్ వెరిఫికేషన్ ఉండటంతో పాటు పెండింగ్ చలాన్లు ఉండకూడదు.

కఠిన చర్యలు తప్పవు

వాహన వివరాలను 'వాహన్' పోర్టల్‌‌‌‌లో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌తో పాటు ఫిజికల్‌‌‌‌ రిజిస్టర్లలోనూ నమోదు చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ గడువును ఏడాది పాటు తగ్గించడం లేదా వాహన పత్రాలు, భద్రతా లోపాలు ఉంటే తక్షణమే సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. పాత లైసెన్సులు వాటి గడువు ముగిసే వరకు చెల్లుబాటు అవుతాయి.