అమెరికా మరో తప్పు చేస్తే ఊరుకోం: ట్రంప్‌‌‌‌కు ఇరాన్ హెచ్చరిక

అమెరికా మరో తప్పు చేస్తే ఊరుకోం: ట్రంప్‌‌‌‌కు ఇరాన్ హెచ్చరిక

టెహ్రాన్: అమెరికా మరోసారి తప్పుడు అడుగు వేస్తే, యుద్ధ క్షేత్రం ఎక్కడ ఉండాలనేది ఇరాన్ బలగాలే నిర్ణయిస్తాయని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖాలిబాఫ్ హెచ్చరించారు. తాము మౌనంగా చూస్తూ ఉండబోమని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు దాడుల హెచ్చరికలు చేస్తూనే, మరోవైపు ఉద్రిక్తతలను తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీతో పాటు పలువురు సీనియర్ కమాండర్లు మృతి చెందడంతో పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైంది. దీనికి ప్రతిగా ఇరాన్.. అమెరికా స్థావరాలపై దాడులు జరపడంతో పాటు హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. ఆ తర్వాత జూన్ 17న కుదిరిన శాంతి ఒప్పందం రెండు వారాలకే రద్దయింది.

ఇరాన్‌‌‌‌పై దాడులు తాత్కాలికంగా వాయిదా!

సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ విజ్ఞప్తి మేరకు ఇరాన్‌‌‌‌పై దాడులను ట్రంప్ తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ‘నేను తలచుకుంటే ఈ యుద్ధాన్ని క్షణంలో ముగించగలను. కానీ మిత్రదేశాల అభ్యర్థన మేరకు దీనిని కొంచెం నిదానంగా, శాంతియుత మార్గంలో పరిష్కరిస్తున్నాం’ అని ట్రంప్ పేర్కొన్నారు.

మరోవైపు, అమెరికా సైన్యం కూడా అవసరమైతే దూకుడు పెంచేందుకు సిద్ధంగా ఉంది. ఇరాన్ అణుకేంద్రాలపై మళ్లీ దాడులు చేసే ప్రత్యామ్నాయాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నారు. తమ షరతులు అంగీకరిస్తేనే ఒప్పందానికి తలుపులు తెరిచి ఉంటాయని, లేదంటే సైనిక శక్తితో బదులిస్తామని ఇరాన్ తేల్చిచెప్పడంతో అక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.