కొండగట్టు అంజన్న చందనోత్సవాలు ప్రారంభం..హాజరైన జీయర్లు, రుత్వికులు, అర్చకులు

కొండగట్టు అంజన్న చందనోత్సవాలు ప్రారంభం..హాజరైన జీయర్లు, రుత్వికులు, అర్చకులు

కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ఆలయంలో చందనోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. సుమారు 60 ఏండ్లుగా మూలవిరాట్టుకు పేరుకుపోయిన చందనాన్ని తొలగించే ప్రక్రియకు వివిధ దేవాలయాల నుంచి వచ్చిన జీయర్లు, రుత్వికులు, అర్చకుల ఆధ్వర్యంలో చేట్టారు. ఆదివారం ఉదయం స్వస్తివచనం, సభానుస్వీకారం, వాసుదేవ పుణ్యాహవచనం, ఆచార్యాది రుత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వరణం తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఉన్న సింధూరాన్ని తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన చేతుల మీదుగా చందనోత్సవ కార్యక్రమం ప్రారంభం కావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. 

చెక్కతో గర్భాలయం మూసివేత.. 

చందనం తొలగింపు కార్యక్రమంలో భాగంగా కొండగట్టులోని గర్భాలయాన్ని చెక్కలతో మూసివేశారు. గర్భాలయం ముందు బాలాలయాన్ని ఏర్పాటుచేసి, చెక్కతో తయారుచేసిన విగ్రహాన్ని ఉంచి భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం హోమశాలలో విష్ణు సహస్రనామ పారాయణం, మృత్యుంజయ హోమం, అంకురార్పణ, యాగశాల ద్వారతోరణార్చన, బలి ప్రదానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. 

అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈవో అంజనారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు జితేంద్రప్రసాద్, చిరంజీవి, స్థానాచార్యులు కపిందర్ పాల్గొన్నారు. చందన తొలగింపు కార్యక్రమాన్ని వీక్షించేందుకు కొండగట్టుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఆఫీసర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా, చందనం తొలగింపు ప్రక్రియ నేపథ్యంలో ఐదు రోజులపాటు ఆలయంలో అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు ఈవో తెలిపారు.