- మహిళా సంఘాల ఆధ్వర్యంలో సెర్ప్ వినూత్న కార్యక్రమం
హైదరాబాద్, వెలుగు: అటవీ శివారు గ్రామాల మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఇంటి ఆవరణలోనే శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగలను పెంచేలా స్వయం సహాయక సంఘాల మహిళలను ప్రోత్సహిస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని సెర్ప్ సస్టైనబుల్ అగ్రికల్చర్ లైవ్లీహుడ్స్ విభాగం ద్వారా శాస్త్రీయ తేనెటీగల పెంపకం ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఇందుకోసం హంబుల్ బీ అనే సంస్థతో సాంకేతిక ఒప్పందం కుదుర్చుకుంది.
మూడు జిల్లాల్లో 1,500 యూనిట్ల టార్గెట్
తొలి విడతలో భాగంగా నాగర్‌కర్నూల్, ములుగు, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 500 చొప్పున మొత్తం 1,500 యూనిట్ల ఏర్పాటును లక్ష్యంగా నిర్దేశించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 109 యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోగా.. అమ్రాబాద్‌లో 79, లింగాలలో 30 ఇప్పటికే గ్రౌండింగ్ అయ్యాయి. ములుగులోని ఎస్ఎస్ తాడ్వాయి మండలంలో 60 యూనిట్లు ప్రారంభమయ్యాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో 30 యూనిట్లు పూర్తికాగా, మరో 289 మంది మహిళలు శిక్షణలో ఉన్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో 199 యూనిట్లలో తేనె ఉత్పత్తి అవుతుంది.
హంబుల్ బీ సంస్థ సహకారం
గ్రామ సంఘాలు, మహిళా సంఘాల ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో మూడు రకాల బాధ్యతలు అప్పగించారు. పువ్వులు లభించని సీజన్లలో తేనెటీగల సంరక్షణ నిమిత్తం ఒక్కో మహిళ రూ. 2,000 స్వయం వాటాగా సమకూర్చుకుంటారు. తేనెటీగలకు ఏడాది పొడవునా ఆహారం అందేలా నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ (ఎన్ఎస్సీ) విత్తనాలతో పెరటి తోటలను పెంచుతున్నారు. కాగా, దేశవ్యాప్తంగా 2,800 మందికి పైగా మహిళలతో 10,500కు పైగా తేనె పెట్టెలను నిర్వహించిన అనుభవమున్న హంబుల్ బీ సంస్థ దీనికి సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. మహిళలు ఉత్పత్తి చేసిన తేనెను నేరుగా కొనుగోలు చేసేందుకు (బై-బ్యాక్) గ్యారెంటీ కల్పించింది.
జనవరి 31 నాటికి పూర్తి..
తేనెటీగల సీజన్‌ను సద్వినియోగం చేసుకుంటూ నిర్దేశిత 1,500 యూనిట్లను రాబోయే జనవరి 31 నాటికి పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ చేయాలని సెర్ప్ లక్ష్యంగా పెట్టుకుంది. 10 పెట్టెలు ఉంచేందుకు వీలుగా రూ. 5,000 నుంచి రూ. 8,000 ఖర్చుతో లో-కాస్ట్ మోడల్ షెడ్డు డిజైన్‌ను రూపొందిస్తున్నారు. గ్రామాల పరిసరాల్లో ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే ప్రత్యేక పూల మొక్కలను నాటిస్తున్నారు. ఉపాధి హామీ పథకం (వీబీ జీ రామ్ జీ), ఐటీడీఏ, ఉద్యానవన మిషన్, ప్రకృతి వ్యవసాయ విభాగాల నిధులను అనుసంధానిస్తూ మహిళలకు శాశ్వత ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు.
