గెరిల్లా డైరీ పుస్తకావిష్కరణ..విప్లవ పంథా తెలంగాణ సమాజాన్ని ప్రజాస్వామీకరించింది: ఘంటా చక్రపాణి

గెరిల్లా డైరీ పుస్తకావిష్కరణ..విప్లవ పంథా తెలంగాణ సమాజాన్ని ప్రజాస్వామీకరించింది: ఘంటా చక్రపాణి
  • భవిష్యత్తు పోరాటాలకు దారిచూపే రచనలు ఉండాలె: దేవ్‌‌జీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: సీనియర్​జర్నలిస్ట్ దూడం మార్కండేయ రచించిన గెరిల్లా డైరీ ఒక వ్యక్తి జీవిత కథ మాత్రమే కాదని, తెలంగాణ సాయుధ పోరాట ఆరంభం నాటి అందరి ఆత్మకథ అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అభివర్ణించారు. ఖైరతాబాద్​లో జరిగిన పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ.. పుస్తకం చదువుతుంటే ఒక డాక్యుమెంటరీలాగా, గతంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుందన్నారు.

50 ఏండ్ల పాటు 18 రాష్ట్రాల్లో నడిచిన విప్లవ ఉద్యమం విఫలమైందని కొందరు మేధావులు వేస్తున్న ప్రశ్నలను ఆయన తప్పుబట్టారు. రాజ్యాధికారం రాకపోయినా, తెలంగాణ సమాజాన్ని, మనుషుల ఆలోచనలను, మానవ సంబంధాలను ప్రజాస్వామీకరించడానికి ఆ ఉద్యమం ఎంతో దోహదం చేసిందన్నారు. విప్లవోద్యమంలో పనిచేసి బయటకు వచ్చిన వారు తమ మాట, చేత, రాతల ద్వారా ప్రజల ప్రయోజనాల పక్షాన నిలబడాలని, ఉద్యమ వైఫల్యాలను సమీక్షించుకుని భవిష్యత్తు పోరాటాలకు దారిచూపేలా రచనలు ఉండాలని మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత దేవ్‌‌జీ అన్నారు.

తరాలు మరిచిపోని జ్ఞాపకాలే మార్కండేయ రాసిన గెరిల్లా డైరీ అని సీనియర్ సంపాదకులు అల్లం నారాయణ అన్నారు. మార్కండేయ రాసిన ‘గెరిల్లా డైరీ’ శైలి అద్భుతమని, ఆయన జర్నలిస్టు కావడం వల్ల ముచ్చట చెప్పినట్లుగానే పదాలు ఉన్నాయని ప్రభాత ఉదయం ఎడిటర్ కట్టా శేఖర్‌‌రెడ్డి పేర్కొన్నారు. గెరిల్లా డైరీ చదువుతున్నంత సేపు ఒకరకమైన బాధ, భయం, ఆగ్రహం ఆవహించాయని రిటైర్డ్ జడ్జి రాజేందర్ జింబో అన్నారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు, జర్నలిస్టులు పాల్గొన్నారు.