నేరాలపై ‘దూరదృష్టి’..నేరం జరగకముందే పసిగట్టేలా ఏఐ టెక్నాలజీ

నేరాలపై ‘దూరదృష్టి’..నేరం జరగకముందే పసిగట్టేలా ఏఐ టెక్నాలజీ
  • నిందితుల నేర చరిత్ర, క్రిమినల్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లపై క్షణాల్లో విశ్లేషణ
  • ఫింగర్‌‌‌‌ ప్రింట్స్‌‌‌‌ నుంచి గత కేసుల వరకు ఒకే వేదికపై సమాచారం
  • ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌లో అందుబాటులోకి
  • ప్రయోగాత్మకంగా అమలు.. ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ

హైదరాబాద్, వెలుగు: నేరాల కట్టడికి రాష్ట్ర పోలీసులు కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. దీని ద్వారా నిందితులను గుర్తించడంతో పాటు వారిపై ఉన్న క్రిమినల్ కేసులు సహా పూర్తి నేరచరిత్రను పోలీసుల ఫింగర్‌‌‌‌‌‌‌‌ టిప్స్‌‌‌‌పై ఉంచనుంది. నేరం జరగకముందే గుర్తించి.. నివారించేందుకు ‘దూరదృష్టి’పేరిట ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌‌‌‌ (ఏఐ)ను సిటీ పోలీసులు డెవలప్‌‌‌‌ చేశారు. ఈ టెక్నాలజీని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌లో ఇటీవలే అందుబాటులోకి తెచ్చారు.

ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌‌‌‌ ఇచ్చే ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో కేసుల దర్యాప్తులో మరింత వేగం పెరుగనుంది. ఇప్పటివరకు ఒక నిందితుడి నేర చరిత్ర, గత కేసులు, ఇతర నేర సంబంధిత వివరాలను తెలుసుకోవాలంటే వివిధ రికార్డులు, డేటాబేస్‌‌‌‌లను పరిశీలించాల్సి వచ్చేది.

ఇందుకోసం పోలీసు అధికారులు, సిబ్బంది రోజుల తరబడి మాన్యువల్‌‌‌‌గా సమాచారాన్ని సేకరించి, సరిపోల్చాల్సి వచ్చేది. అయితే ‘దూరదృష్టి’ద్వారా క్రైమ్ ఇంటెలిజెన్స్, ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ ఒకే ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌పైకి వచ్చింది. నిందితుల నేర చరిత్రను విశ్లేషించడంతో పాటు వారి కార్యకలాపాలు, నేర సంబంధాలు, క్రిమినల్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లను క్షణాల్లోనే పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. నిందితులకు సంబంధించిన కార్యకలాపాలు అతడితో అనుబంధం ఉన్న నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లపై సమగ్ర అవగాహన పొందేందుకు ‘దూరదృష్టి’ దోహదపడుతుంది.

దర్యాప్తు అధికారులకు సమయం ఆదా..

సాధారంగా ఏదైన నేరం జరిగితే సంబంధిత నేరం జరిగిన తీరు, నిందితుల ఫింగర్ ప్రింట్స్‌‌‌‌ సహా పూర్తి డేటాబేస్‌‌‌‌ను సేకరించడంలో పోలీసులకు సమయం వృధా అయ్యేది. ఈ ప్లాట్‌‌‌‌ఫామ్ ద్వారా నిందితుల సమాచారాన్ని సేకరించడం, క్రాస్ చెక్ చేయడం వంటి పనుల్లో పట్టే సమయం, శ్రమను గణనీయంగా తగ్గించవచ్చు. ఈ క్రమంలో దర్యాప్తు అధికారుల క్షేత్రస్థాయి విచారణ, సాక్ష్యాధారాల సేకరణ, కేసుల దర్యాప్తు, సకాలంలో చార్జిషీట్లు దాఖలు చేయడంపై మరింత దృష్టి సారించే అవకాశం ఉంటుంది. డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పూర్తి డేటాబేస్‌‌‌‌ను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా దర్యాప్తు వేగం, నాణ్యత పెరుగుతాయని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

నేరాలు జరగకముందే గుర్తించే దిశగా..

నేరం జరిగిన తర్వాత దర్యాప్తు చేపట్టే విధానానికి భిన్నంగా, నేరాలకు సంబంధించిన ముందస్తు సంకేతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టే దిశగా ‘దూరదృష్టి’కీలకంగా మారనుంది. నేరగాళ్ల నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లను గుర్తించడం, వ్యవస్థీకృత నేర కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, సంభావ్య నేరాలను నిరోధించడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ మేరకు ఏండ్ల తరబడి పోలీసుల వద్ద ఉన్న సమాచారాన్ని సమర్థంగా వినియోగించుకుని, దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడే విధంగా రూపొందించారు. వివిధ విభాగాల సమాచార సమీకరణ ద్వారా శాంతిభద్రతలను కాపాడేందుకు ‘దూరదృష్టి’ని వినియోగించనున్నారు.