బహ్రెయిన్‌‌‌‌పై ఇరాన్ డ్రోన్ అటాక్..అమెరికా రాడార్ సిస్టమ్ ధ్వంసం

బహ్రెయిన్‌‌‌‌పై ఇరాన్ డ్రోన్ అటాక్..అమెరికా రాడార్ సిస్టమ్ ధ్వంసం
  • పేలుళ్లు, సైరన్ల మోతతో దద్దరిల్లిన గల్ఫ్ దేశం
  • సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు హెచ్చరిక

మనామా: గల్ఫ్ దేశమైన బహ్రెయిన్‌‌‌‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ పేలుళ్లు, ప్రమాద సైరన్ల మోతతో తీవ్ర కలకలం రేగింది. తమ దేశంలోని అమెరికా సైనిక స్థావరంపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్(ఐఆర్‌‌‌‌‌‌‌‌జీసీ) డ్రోన్లతో దాడికి పాల్పడటంతో బహ్రెయిన్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. స్థానిక కాలమానం ప్రకారం వేకువజామున 4 గంటలకు తొలిసారిగా, ఆ తర్వాత ఉదయం 6:30 గంటలకు మరోసారి వరుస పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. 

ఈ నేపథ్యంలో బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ ‘ఎక్స్‌‌‌‌’ లో వరుస హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా సంయమనం పాటించాలని, తక్షణమే సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అధికారిక వార్తలను మాత్రమే నమ్మాలని సూచించింది. బహ్రెయిన్‌‌‌‌లోని అమెరికా సైనిక స్థావరంపై తమ బలగాలు డ్రోన్లతో దాడులు చేశాయని ఐఆర్‌‌‌‌‌‌‌‌జీసీ ఆదివారం ప్రకటించింది. ‘‘బహ్రెయిన్‌‌‌‌లోని అల్-రిఫా హెలికాప్టర్ బేస్‌‌‌‌లో ఉన్న అమెరికా ఎయిర్ డిఫెన్స్ రాడార్ సిస్టమ్‌‌‌‌ను లక్ష్యంగా చేసుకుని ఆరు డ్రోన్లతో దాడి చేశాం. హార్మూజ్ జలసంధిని మూసివేశాం. అమెరికన్ల నుంచి ఎలాంటి దుందుడుకు చర్యలు ఎదురైనా, అంతకంటే కఠినమైన, శక్తిమంతమైన రీతిలో సమాధానం చెబుతాం’’ అని హెచ్చరించింది.

8 నెలలుగా కొనసాగుతున్న యుద్ధం

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌‌‌‌పై ఆకస్మిక దాడులు ప్రారంభించినప్పటి నుంచి గత 8 నెలలుగా పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో కీలక వాణిజ్య మార్గమైన హార్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకుంటోంది.