బంగ్లాదేశ్లో మళ్లీ కార్మికుల నిరసన.. 50 ఫ్యాక్టరీలు మూసివేత.. 13 యూనిట్లు నిరవధిక బంద్

బంగ్లాదేశ్లో మళ్లీ కార్మికుల నిరసన.. 50 ఫ్యాక్టరీలు మూసివేత.. 13 యూనిట్లు నిరవధిక బంద్

బంగ్లాదేశ్‌‌‌‌లో కనీస వేతనం రూ.12,500 నుంచి రూ.30 వేలకు పెంచాలంటూ గార్మెంట్ కార్మికులు ఆందోళనకు దిగారు. గాజీపూర్‌‌‌‌లోని కోనబరి, మౌచాక్ ప్రాంతాల్లో కార్మికులు రోడ్లపైకి రావడంతో ఉద్రిక్తత, ఘర్షణ నెలకొంది. దీంతో 50 ఫ్యాక్టరీలు మూతపడ్డాయి.

ఢాకా: బంగ్లాదేశ్‌‌‌‌లో గార్మెంట్​కార్మికుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. కనీస వేతనాన్ని నెలకు రూ.12,500 నుంచి రూ.30,000కు పెంచాలంటూ కార్మికులు చేస్తున్న నిరసనలతో పారిశ్రామిక ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. గాజీపూర్‌‌‌‌లోని కోనబరి, మౌచాక్ ప్రాంతాల్లో కార్మికులు రోడ్లపైకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, సౌండ్ గ్రెనేడ్లు ప్రయోగించారు. ఈ ఘర్షణల నేపథ్యంలో 13 ఫ్యాక్టరీలను నిరవధికంగా మూసివేయగా, మరో 5 యూనిట్లకు ఒక రోజు సెలవు ప్రకటించారు. మొత్తం మీద ఈ జోన్‌‌‌‌లో 50 ఫ్యాక్టరీలు మూతపడ్డాయి.

అప్రమత్తమైన ప్రభుత్వం.. భారీగా బలగాలు

పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు ప్రభుత్వం భారీగా భద్రతా బలగాలను రంగంలోకి దించింది. బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) సిబ్బందితో పాటు, ప్రత్యేక బలగాలు, పోలీసులను కీలక ప్రాంతాల్లో మోహరించారు. సోమవారం వేతన సవరణ బోర్డు సమావేశమై కొత్త వేతన సిఫార్సులను ఖరారు చేయనుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త విధానం అమలయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశానికి హాజరై తమ ప్రతిపాదనలను సమర్పిస్తామని బంగ్లాదేశ్ గార్మెంట్ తయారీదారులు, ఎగుమతిదారుల సంఘం (బీజీఎంఈఏ) ప్రకటించింది. కాగా, కార్మికులు విధులకు హాజరై ఉత్పత్తిని తిరిగి ప్రారంభించకపోతే నిరవధికంగా ఫ్యాక్టరీలను మూసివేస్తామని, వేతనాలు చెల్లించబోమని యజమానులు ఇప్పటికే హెచ్చరించారు. 

ఎగుమతులపై తీవ్ర ప్రభావం

చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దుస్తుల ఎగుమతిదారుగా ఉన్న బంగ్లాదేశ్‌‌‌‌లో ఈ రంగంపై 40 లక్షల మంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. దేశ ఎగుమతి ఆదాయంలో దీని వాటా 80 శాతానికి పైగా ఉంది. హెచ్‌‌‌‌అండ్‌‌‌‌ఎం, జారా వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లకు ఇక్కడి నుంచే దుస్తులు వెళ్తాయి. ప్రస్తుతం స్ప్రింగ్, సమ్మర్ సీజన్ ఆర్డర్లకు ఇదే కీలక సమయం కావడంతో.. ఈ ఆందోళనలు కొనసాగితే విదేశీ ఆర్డర్లు రద్దయ్యే ప్రమాదముందని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.