బీజింగ్: బ్యాటరీ టెక్నాలజీలో చైనా మరో అడుగు ముందుకేసింది. 19 సీట్ల సామర్థ్యమున్న ఎలక్ట్రిక్ ఫ్లైట్ ను క్రూసభ్యులతో విజయవంతగా పరీక్షించింది. దాదాపు 10 టన్నుల బరువున్న సీఈ-25ఏ విమానాన్ని ఆదివారం తొలిసారి షాండాంగ్ ప్రావిన్స్‌లో టెస్ట్ చేసింది. గంటకు అత్యధికంగా 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగల ఈ ఫ్లైట్‌లో సిబ్బంది కూడా ఉండటం విశేషం.
ఒక్కసారి ఛార్జింగ్‌తో ప్రయాణికులను దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని గమ్యస్థానాలకు చేర్చాలనే లక్ష్యంతో దీనిని తయారు చేశారు. ఈ విమానానికి మొత్తం 57 నిమిషాలకు పైగా పరీక్షలు నిర్వహించగా.. 16 నిమిషాలపాటు గాల్లోనే ఉంది. ఈ సమయంలో సుమారు 60 కిలోమీటర్లకు పైగా దూరాన్ని కవర్ చేసిందని చైనాకు చెందిన సీసీటీవీ పేర్కొంది. ఆ సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు, ఒక ఫ్లైట్ టెస్ట్ ఇంజినీర్ ఉన్నారు.
