పర్వతగిరి, వెలుగు : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కఅన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండలో ఆదివారం హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్ఏఎం) ఫేజ్-1 కింద టీజీఆర్డీపీ ద్వారా పీఆర్ఈడీ శాఖ ఆధ్వర్యంలో 17వ ప్యాకేజీ ద్వారా రూ.58.44 కోట్లతో 68.61 కిలోమీటర్ల మేర 41 రోడ్ల నిర్మాణ పనులకు వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ సత్యశారదతో కలిసి శంకుస్థాపన చేశారు.
అంతకుముందు భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన ఫొటోకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ అభివృద్ధి పనులతో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు గ్రామాల మధ్య అనుసంధానం బలోపేతమవుతుందన్నారు. రోడ్ల నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం మండల వ్యాప్తంగా 634 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి, చౌటపెల్లి సొసైటీ చైర్మన్లు అనిల్రావు, కుమారస్వామి, ఆర్డీవో సుమ, డీపీవో కల్పన తదితరులు పాల్గొన్నారు.
