కొత్త పింఛన్లలో 60 శాతం వితంతువులకే!

కొత్త పింఛన్లలో 60 శాతం వితంతువులకే!
  •     మొత్తం కొత్త చేయూత పింఛన్లలో 60 శాతం వారికే
  •     19న ఇందిరా జయంతి సందర్భంగా ఖాతాల్లో నగదు జమ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేయూత స్కీమ్​కింద కొత్తగా మంజూరు చేసిన 4,63,857 పింఛన్లలో వితంతువులకే సింహభాగం దక్కింది. మొత్తం కొత్త లబ్ధిదారుల్లో దాదాపు 60 శాతం అంటే 2,77,894 మంది వితంతువులకు ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ఆ తర్వాత అత్యధికంగా 1,00,224 మంది దివ్యాంగులు, 53,844 మంది ఒంటరి మహిళలు, 27,444 మంది గీత కార్మికులు, 4,451 మంది చేనేత కార్మికులు ఉన్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న కొత్త లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా పింఛన్ సొమ్మును జమ చేసేందుకు సెర్ప్ ఏర్పాట్లు చేస్తోంది. 

ఈ నగదు బదిలీకి ఆర్థికశాఖ ఆమోదం లభించడంతోపాటు ప్రభుత్వం అదనపు బడ్జెట్‌‌‌‌ను కూడా మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు మంజూరు పత్రాల పంపిణీ చేయనున్నారు. కాగా, కొత్త పింఛన్ల మంజూరులో హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 35,730  రాగా.. ఆ తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి (30,232), నల్గొండ (26,546), మేడ్చల్–మల్కాజిగిరి (25,671), ఖమ్మం (22,801) జిల్లాలు ఉన్నాయి. మరోవైపు అత్యల్పంగా ములుగు జిల్లాలో కేవలం 4,087 కొత్త పింఛన్లు మాత్రమే మంజూరయ్యాయి. తక్కువ పింఛన్లు వచ్చిన జిల్లాల్లో జయశంకర్ భూపాలపల్లి (6,457), రాజన్న సిరిసిల్ల (7,327), నారాయణపేట (7,405), కుమురం భీం ఆసిఫాబాద్ (7,712) జిల్లాలున్నాయి. 

విభాగాల వారీగా..

వితంతు పించన్లు–24,956, ఒంటరి మహిళా పించన్లు–4,714 హైదరాబాద్‌‌‌‌లోనే అత్యధికంగా మంజూరయ్యాయి. దివ్యాంగుల పించన్లు(7,007), గీత కార్మికుల పించన్ల (3,492) లో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, చేనేత కార్మికుల పింఛన్లు యాదాద్రి భువనగిరి (932), రాజన్న సిరిసిల్ల (910) జిల్లాల్లో ఎక్కువగా వచ్చాయి. ఈ నెల 19న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కావడంతో కొత్తగా పింఛన్లు పొందుతున్న కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది.