భారత్ లో 2031 వన్డే వరల్డ్ కప్..2029 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా..

భారత్ లో 2031 వన్డే వరల్డ్ కప్..2029 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా..
  •     ఆతిథ్య హక్కులు దక్కించుకున్న భారత్
  •     2035 వరకు ఐసీసీ మేజర్ టోర్నీల షెడ్యూల్ ఖరారు 

బాలి: 2031 వన్డే వరల్డ్​కప్ ఆతిథ్య హక్కులను భారత్​దక్కించుకుంది. ఈ మేజర్ టోర్నీని బంగ్లాదేశ్‌‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించనుంది. 2029 చాంపియన్స్ ట్రోఫీకి కూడా ఇండియానే హోస్ట్​ చేయనుంది. ఈ మేరకు ఆదివారం ఇండోనేషియా బాలిలో జరిగిన  అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బోర్డు సమావేశంలో 2035 వరకు నిర్వహించనున్న ఐసీసీ పురుషుల మేజర్ క్రికెట్ టోర్నమెంట్ల విండోలను (తేదీలను) ఆమోదించింది.

భారత్‌‌లో టోర్నీలు: 2006 తర్వాత ఇండియా తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ 2029 అక్టోబర్ 9 నుంచి 28 వరకు జరుగుతుంది. అలాగే 2023 తర్వాత మళ్లీ 2031 అక్టోబర్ 9 నుంచి నవంబర్ 23 వరకు వన్డే ప్రపంచకప్ భారత్, బంగ్లాదేశ్ వేదికలుగా జరగనుంది. 2027 వన్డే ప్రపంచకప్  దక్షిణాఫ్రికా వేదికగా అక్టోబర్-, నవంబర్‌‌లోనే జరగనుంది.   

2028 టీ20 ప్రపంచకప్‌‌ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో..

2028 టీ20 ప్రపంచకప్‌‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్; 2030 టీ20 ప్రపంచకప్‌‌కు ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2029, 2031 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ ఇంగ్లండ్‌‌లోనే జరగనున్నాయి. 2031 తర్వాత జరిగే టోర్నీలకు తేదీలను ప్రకటించినప్పటికీ, ఆతిథ్య దేశాలను ఇంకా ఖరారు చేయలేదు.  ఈ సందర్భంగా ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా మాట్లాడుతూ.. ఆటగాళ్లు, క్రికెట్ బోర్డులకు దీర్ఘకాలిక స్పష్టతను ఇచ్చేందుకే ఈ క్యాలెండర్‌‌ను రూపొందించామని, ఇది క్రికెట్ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు.


 
బంగ్లాదేశ్, అమెరికాల్లో  ఒలింపిక్ క్రికెట్ క్వాలిఫయర్స్
2028 లాస్ ఏంజెల్స్ వేసవి ఒలింపిక్స్‌‌ క్రికెట్ పోటీలకు సంబంధించిన క్వాలిఫయర్ టోర్నమెంట్‌‌లు ఫిబ్రవరి-, మార్చి నెలల్లో బంగ్లాదేశ్, అమెరికా వేదికలుగా జరగనున్నాయని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆదివారం ప్రకటించింది. పురుషుల క్వాలిఫయర్ పోటీలు 2028 ఫిబ్రవరి 5 నుంచి 13 వరకు బంగ్లాదేశ్‌‌లో, మహిళల క్వాలిఫయర్ పోటీలు 2028 ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు అమెరికాలో నిర్వహించనున్నారు.