- విచారణకు ఎఫ్‌ఏఏ ఆదేశం
- అమెరికాలోని మయామిలో తప్పిన పెను ప్రమాదం
అమెరికాలోని మయామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై వెళ్తున్న విమానాన్ని, టేకాఫ్‌కు సిద్ధమవుతున్న కార్గో విమానం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. విమానంలోని 172 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) ఎంక్వైరీకి ఆదేశించింది.
వాషింగ్టన్: అమెరికాలోని మయామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై వెళ్తున్న కోపా ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల విమానాన్ని, టేకాఫ్‌కు సిద్ధమవుతున్న యూపీఎస్ కార్గో విమానం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. విమానంలోని 172 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పనామా సిటీ నుంచి 166 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వచ్చిన కోపా ఎయిర్‌లైన్స్ విమానం మయామిలో ల్యాండై, సాధారణ వేగంతో రన్‌వేపై వెళ్తోంది. అదేసమయంలో కొలంబియాలోని బొగోటాకు బయలుదేరేందుకు యూపీఎస్ కార్గో విమానం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే రెండు విమానాలు ఢీకొనడంలో కోపా ఎయిర్‌లైన్స్ విమానం రెక్క దెబ్బతింది.
నిబంధనల ఉల్లంఘనే కారణం?
ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) విచారణకు ఆదేశించింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) ఆడియో రికార్డులు, ప్రాథమిక నివేదికల ప్రకారం.. గ్రౌండ్ క్లియరెన్స్ నిబంధనల ఉల్లంఘన వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కోపా విమానానికి దారి ఇవ్వాలని యూపీఎస్ సిబ్బందికి కంట్రోలర్లు ముందే స్పష్టంగా సూచించినట్లు సమాచారం. ప్రమాదం తర్వాత విమానాన్ని గేట్ వద్దకు సురక్షితంగా తరలించి, అందులోని మొత్తం 172 మందిని కిందకు దించినట్లు కోపా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.
ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారి భద్రతే తమకు అత్యంత ముఖ్యమని
తెలిపింది. తమ సిబ్బందికి కూడా ఎలాంటి హాని జరగలేదని, విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని యూపీఎస్ సంస్థ స్పష్టం చేసింది.
