- వివాదాస్పద వ్యాఖ్యలపై సిమ్లా పోలీసుల ఎఫ్ఐఆర్
సిమ్లా: గాంధీ కుటుంబంపై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌పై హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె కుమారులు రాజీవ్, సంజయ్ గాంధీల మరణాలపై నవంబర్ 10న కంగనా పెట్టిన పోస్టులపై స్థానికుడు అతుల్ శర్మ ఫిర్యాదు చేశారు. సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు ప్రజాశాంతికి భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. దీంతో శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, పరువునష్టం తదితర సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ వ్యవహారంపై రాష్ట్రంలో రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. కంగనాపై కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యేనని మాజీ సీఎం, బీజేపీ నేత జైరామ్ ఠాకూర్ ఆరోపించారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను కాంగ్రెస్ ప్రభుత్వం సహించలేకపోతోందని, బీజేపీ నేతలపై అభ్యంతరకర పోస్టులు పెట్టేవారిపై మాత్రం చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల చర్యను సమర్థించింది.
