అమ్మతోడు ఇది AI కాదు.. మబ్బుల్లో అసలే కాదు.. ఢిల్లీలోని యమునా నదిలో నురగల మధ్య మహిళల పూజలు!

అమ్మతోడు ఇది AI కాదు.. మబ్బుల్లో అసలే కాదు.. ఢిల్లీలోని యమునా నదిలో నురగల మధ్య మహిళల పూజలు!

ఆకాశం నేలకు వచ్చింది.. మేఘాలలో తేలిపోన్నది.. అని కవులు అందంగా కవిత్వం రాస్తుంటారు. అలాంటి సుందర దృశ్యాలు కనిపించినప్పుడు ప్రకృతి సోయగాన్ని అలా వర్ణిస్తుంటారు. కానీ మేఘాలు భూమికి చేరకుండానే మేఘాల్లో తేలిన ఫీల్ రావాలంటే యమునా నదికి వెళ్లి తీరాల్సిందే. నదిలోకి దిగితే చుట్టూ మబ్బులు అల్లుకున్నట్లుగా.. హిమాలయాల్లో కొండల్లో తెల్లని  ఘన మంచులో కూర్చున్నట్లుగా యమునా నది నురగలు మనకు కృత్రిమ ఫీల్ తీసుకొస్తాయి. ఢిల్లీలో యుమునా నదిలో కాలుష్య కారకాలతో  పొంగుతున్న నురగలు ఒకవైపు స్పెషల్ అట్రాక్షన్ అవుతుండగా.. మరోవైపు నిది కాలుష్యంపై రాజకీయ దుమారం రేగుతున్న పరిస్థితి. 

ఢిల్లీలో వాయు కాలుష్యమే కాదు.. జల కాలుష్యం కూడా ఎంత ఘోరంగా ఉందో చెప్పేందుకు నిదర్శనం యమునా నదిలో పొంగుతున్న నురగలు. కంపెనీల వ్యర్థాలు, కెమికల్స్ కలవడంతో కొన్ని టన్నుల లారీల సర్ఫును పోసినట్లుగా తెల్లగా.. అందమైన హిమతలంగా యమునా నది కనిపిస్తోంది. కార్తీక మాసం తొలి సోమవారం (2026 నవంబర్ 16) కావడంతో యమునా హారతికి వెళ్లిన భక్తులు నురగలో చుట్టుముట్టిన వీడియోలు వైరల్ గా మారాయి. అధికార బీజేపీ, విపక్ష ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య విమర్శలకు కారణమయ్యాయి.  

ఢిల్లీలో చాత్ పూజ వేడుకల సందర్భంగా యమునా నదిలో విషపూరిత నురుగు కనిపించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ , భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ల మధ్య తీవ్ర రాజకీయ విమర్శలకు కారణమైంది. యమునా నదిని క్లీన్ చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన బీజేపీ.. ఇప్పుడు ఏం చేస్తోందని ఆప్ విమర్శిస్తోంది. తప్పుడు హామీలతో జనాలను మోసం చేసిందని విమర్శలకు దిగింది.  రేఖా గుప్తా నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం యమునను శుభ్రం చేసినట్లు చెప్పుకున్న ప్రచారం అంతా ఫేక్ అని  ఎక్స్‌లో పోస్ట్ చేసింది. 

చాత్ పూజకోసం యమునకు వచ్చిన భక్తులు విషపూరిత నురుగు మధ్యే పూజలు చేస్తున్న దృశ్యాలు ఉన్న వీడియోను షేర్ చేసింది ఆప్.  నాట్ ఏఐ, దిస్ ఇజ్ యమున ఆన్ చాత్ అని క్యాప్షన్ పెట్టింది. ఇది ఏఐ కాదు.. ఛాత్ పూజ రోజు యమున పరిస్థితి ఇది అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం యమునను శుభ్రం చేసిందన్న అబద్ధాలు ఈరోజు బయటపడ్డాయి. చాత్ భక్తులు విషపూరిత నురుగు మధ్యే ఈ మహాపర్వాన్ని జరుపుకోవాల్సి వచ్చింది అని ఆప్ విమర్శింది. 

అయితే బీజేపీ మాత్రం యమునా ఇప్పుడే మరింత శుభ్రంగా మారిందని వాదిస్తోంది.  ఇంతకుముందు చాత్ నిషేధించిన యమునలోనే ఇప్పుడు రెండేళ్లలో సగానికి పైగా శుభ్రం అయింది. ఢిల్లీ సనాతనీ సీఎం అందులోనే చాత్ జరుపుకుంటున్నార  అని  స్పందించింది.  

ALSO READ : శబరిమల సిబ్బందికి భోజనం అందించాల్సిందే..కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు

 ఈసారి చాత్ వేడుకలు గొప్పగా జరుగుతున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చెప్పారు.  దశాబ్దాల తర్వాత ఢిల్లీలో చాత్ మహాపర్వం ఇంత వైభవంగా జరుగుతోంది.  యమునా తీరం నుంచి సుమారు 1,400 చాత్ ఘాట్‌ల వరకు లక్షలాది భక్తుల భక్తి, సూర్య భగవాన్ పూజతో   నిండిపోయిందని ఆమె ఎక్స్‌లో రాశారు. పూర్వాంచల్ ప్రజలకు క్షమాపణలు చెబుతూ, వచ్చే ఏడాది  మరింత మెరుగైన ఏర్పాట్లు చేస్తానని తెలిపారు.