అయ్యప్ప స్వామి భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న మండల యాత్రకు శబరిమల ఆలయం సిద్ధమైంది. వార్షిక మండల యాత్రా సీజన్‌ను పురస్కరించుకుని సోమవారం (నవంబర్ 16) సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే మండల యాత్రకు సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు శబరిమల, మలిక్కాపురం ఆలయాల తలుపులను కొత్తగా నియమితులైన ప్రధాన పూజారులు భక్తుల దర్శనం కోసం తెరుస్తారు. దీంతో మండల యాత్ర అధికారికంగా ప్రారంభమవుతుంది.
డిసెంబర్ 27న మండల పూజ నిర్వహించి ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు మకరవిళక్కు యాత్ర కోసం ఆలయాన్ని తెరుస్తారు. జనవరి 14న మకరవిళక్కు పండుగ జరగనుంది. జనవరి 19 వరకు భక్తులకు దర్శన అవకాశం ఉంటుంది. జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారు.
దర్శనానికి ఆన్లైన్ బుకింగ్ తప్పనిసరి
ఈసారి రోజుకు గరిష్ఠంగా 80 వేల మంది భక్తులకు మాత్రమే దర్శన అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం ఆన్లైన్ బుకింగ్ తప్పనిసరి చేశారు. అయ్యప్ప భక్తులు ముందుగానే దర్శన స్లాట్ బుక్ చేసుకుని యాత్రకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు ప్రయాణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ALSO READ : శబరిమల సిబ్బందికి భోజనం అందించాల్సిందే..కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు
మరోవైపు సోమవారం సాయంత్రం మేల్శాంతి (ప్రధాన పూజారి) ఇ.డి. ప్రసాద్ నంబూతిరి పదవీవిరమణ చేయనున్నారు. తంత్రి కందారు బ్రహ్మదాతన్ సమక్షంలో ఆలయ ద్వారాలను తెరిచి లాంఛనప్రాయంగా దీపాన్ని వెలిగించి అనంతరం 18 పవిత్ర మెట్లు దిగి ఆలయం ముందు పవిత్ర అగ్ని (ఆళి)ని వెలిగిస్తారు. కొత్తగా నియమితులైన ప్రధాన పురోహితులను సన్నిధానానికి తీసుకెళ్తారు. సాయంత్రం 6.30 గంటలకు నూతన మేల్శాంతి అరెక్కర సుబ్రమణియన్ శంకరన్ నంబూతిరికి తంత్రి పవిత్రోత్సవం నిర్వహిస్తారు. సోమవారం ఇతర పూజా కార్యక్రమాలు ఉండవని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధికారులు వెల్లడించారు.
