‘మీరు దొంగలు’.. అంటూ..విమానం లేటైందని రచ్చరచ్చ.. స్పైస్‌జెట్ సిబ్బందికి చుక్కలు చూపించిన ప్యాసింజర్లు!

 ‘మీరు దొంగలు’.. అంటూ..విమానం లేటైందని రచ్చరచ్చ.. స్పైస్‌జెట్ సిబ్బందికి చుక్కలు చూపించిన ప్యాసింజర్లు!

విమాన ప్రయాణం అంటేనే చాలామందికి ఒక ప్రత్యేకమైన అనుభూతి. అనుకున్న సమయానికి విమానం ఎక్కి, గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విమానం ఆలస్యమైతే మాత్రం ప్రయాణికులు సహనం కోల్పోతారు. ముఖ్యంగా గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తే ఆ అసహనం మరింత పెరుగుతుంది. అయితే ఆ కోపం హద్దులు దాటితే పరిస్థితి ఎలా మారుతుందో తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే అర్థమవుతుంది.

స్పైస్‌జెట్ విమానం ఆలస్యమైందన్న కారణంతో కొందరు ప్రయాణికులు ఎయిర్‌లైన్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతటితో ఆగకుండా సిబ్బందిని నోటికొచ్చినట్లు దూషిస్తూ, వారిపై దాడికి ప్రయత్నించినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. కొందరు ప్రయాణికులు సిబ్బందిని ‘దొంగలు’ అంటూ పదేపదే నిందించడం కూడా వినిపిస్తోంది.

అసలు ఏం జరిగింది?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో స్పైస్‌జెట్‌కు చెందిన ఫ్రంట్‌లైన్ సిబ్బందిని కొందరు ప్రయాణికులు చుట్టుముట్టి నిలదీస్తున్నట్లు కనిపిస్తోంది. విమానం ఆలస్యం కావడంతో తీవ్ర అసహనానికి గురైన ప్రయాణికులు వారి కోపాన్ని సిబ్బందిపై చూపించినట్లు తెలుస్తోంది.

ఓ ప్రయాణికుడు అయితే మాటలతోనే కాకుండా చేతులతోనూ దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. సిబ్బందిని పదేపదే దూషిస్తూ, ‘మీరు దొంగలు’ అంటూ ఆరోపణలు చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఈ క్రమంలో అక్కడున్న మరికొందరు ప్రయాణికులు కూడా వాగ్వాదంలోకి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారినట్లు కనిపిస్తోంది.

అయితే ఈ ఘటన ఏ విమానాశ్రయంలో జరిగింది ? ఏ రూట్‌లో వెళ్లాల్సిన విమానం ఆలస్యమైంది ? అసలు ఆలస్యానికి కారణమేంటి ? అనే విషయాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. 

గంటల తరబడి ఎదురుచూపులు..  
విమానం ఆలస్యమైతే ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కొందరికి ముఖ్యమైన సమావేశాలు ఉండొచ్చు. మరికొందరు కుటుంబికులను  కలవడానికి వెళ్తుండొచ్చు. ఇంకొందరికి కనెక్టింగ్ ఫ్లైట్లు ఉండొచ్చు. మరికొందరు చిన్నపిల్లలు, వృద్ధులతో కలిసి ప్రయాణిస్తుంటారు. అలాంటి సమయంలో విమానం ఆలస్యమైతే ఆందోళన, అసహనం కలగడం సహజమే. ముఖ్యంగా ఆలస్యానికి కారణం ఏమిటో సరైన సమాచారం అందకపోతే ప్రయాణికుల్లో ఆగ్రహం మరింత పెరుగుతుంది.

అయితే ఎంత అసౌకర్యం ఎదురైనా విమాన సిబ్బందిపై దాడి చేయడం, దూషించడం సరైన పరిష్కారం కాదు. అదే సమయంలో ప్రయాణికులకు విమాన ఆలస్యంపై స్పష్టమైన సమాచారం ఇవ్వడం, వారి సమస్యలను ఓపికగా వినడం ఎయిర్‌లైన్ బాధ్యత కూడా.  

స్పైస్‌జెట్‌కు ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు!
ప్రయాణికులు, ఎయిర్‌లైన్ సిబ్బంది మధ్య గొడవలు జరగడం ఇదేం  మొదటిసారి కాదు. గతంలోనూ స్పైస్‌జెట్‌కు సంబంధించి ఇలాంటి ఘటనలు వార్తల్లో నిలిచాయి.

నవంబర్ 2026లో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానం రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో విమాన సంస్థ సిబ్బంది, భద్రతా సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగినట్లు కొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

ALSO READ : అమ్మతోడు ఇది AI కాదు.. మబ్బుల్లో అసలే కాదు.. 

అంతకుముందు, జూలై 2025లో శ్రీనగర్ విమానాశ్రయంలోనూ స్పైస్‌జెట్ సిబ్బందిపై దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎక్స్ట్రా క్యాబిన్ బ్యాగేజీకి సంబంధించిన ఛార్జీల విషయంలో తలెత్తిన వివాదం చివరకు ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఓ ఆర్మీ అధికారి కొందరు  స్పైస్‌జెట్ గ్రౌండ్ సిబ్బందిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ దాడిలో కొందరు ఉద్యోగులు గాయపడటంతో ఎయిర్‌లైన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

చివరికి నష్టపోయేది ఎవరు?
విమానం ఆలస్యమైతే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు. వారి ప్రయాణ ప్రణాళికలు దెబ్బతినడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేయడంలోనూ ఆశ్చర్యం లేదు. కానీ ఆ కోపం దాడులు, దూషణల రూపం తీసుకుంటే సమస్య మరింతగా చేజారుతుంది. ప్రయాణికుల సమస్యలను అర్థం చేసుకుని ఎయిర్‌లైన్స్ సరైన సమాచారం అందించాలి. 

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలోని ఘటనపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది. విమాన ఆలస్యానికి అసలు కారణమేంటి? ప్రయాణికుల ఆరోపణల్లో వాస్తవమెంత? ఎయిర్‌లైన్ ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోనుంది? అన్నది తెలియాల్సి ఉంది.