టూరిస్టు వీసాతో మోసం : విదేశాల్లో జైలు పాలైన కామారెడ్డి యువకుడు

టూరిస్టు వీసాతో మోసం : విదేశాల్లో జైలు పాలైన కామారెడ్డి యువకుడు

వీసా ఏజెంట్ల మోసానికి ఓ యువకుడు  విదేశాల్లో పడరాని పాట్లుపడుతున్నాడు. విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించాలని ఎన్నో కలలుకంటూ విదేశాలకు వెళ్లిన ఆ యువకుడికి చివరికి దేశం కాని దేశంలో జైలు కూడు తినాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పు చేసీ మరీ వీసా కోసం ఏజెంట్లకు డబ్బులు చెల్లించాడు. కానీ నమ్మిన ఏజెంట్ల మోసం చేయడంతో విదేశాల్లో దిక్కుతోచని స్థితిలో తనను విడిపించాలని వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే..  

ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించాలనే ఆశతో విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు ఏజెంట్ మోసంతో జైలు పాలయ్యాడు. ఉపాధి కోసం మలేషియా వెళ్లిన కామారెడ్డి జిల్లాకు చెందిన సురేష్.. వీసా గడువు ముగియడంతో గత నాలుగు నెలలుగా అక్కడి జైలులోనే ఉంటున్నాడు. తన భర్తను ఎలాగైనా విడిపించి స్వదేశానికి తీసుకురావాలని అతడి భార్య మౌనిక ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేష్‌కు మలేషియాలో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ఏజెంట్ నమ్మించాడు. కంపెనీ వీసా ఇప్పిస్తానని చెప్పి టూరిస్ట్ వీసాపై మలేషియాకు పంపించాడు. ఇందుకోసం రూ.1.40 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత వీసా గడువు ముగియడంతో సురేష్ ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ క్రమంలో మలేషియా అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు. గత నాలుగు నెలలుగా సురేష్ జైలులోనే మగ్గుతున్నాడు.

ALSO READ :  ‘మీరు దొంగలు’.. అంటూ..విమానం లేటైందని రచ్చరచ్చ..

మరోవైపు భర్తను జైలు నుంచి విడిపిస్తానని చెప్పిన ఏజెంట్ కుటుంబ సభ్యుల నుంచి మరో రూ.1.70 లక్షలు వసూలు చేసినట్లు మౌనిక ఆరోపిస్తోంది. భర్త విడుదల కోసం తన వద్ద ఉన్న బంగారునగలు సైతం తాకట్టు పెట్టి డబ్బులు చెల్లించినట్లు తెలిపింది. అయినప్పటికీ సురేష్ విడుదల కాకపోవడంతో మోసపోయానని గ్రహించి తాడ్వాయి పోలీసులను ఆశ్రయించింది.

తన భర్తను విదేశీ జైలు నుంచి విడిపించి, క్షేమంగా స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మౌనిక విజ్ఞప్తి చేస్తోంది. ఏజెంట్ మోసంపై విచారణ జరిపి న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతోంది.