బిగ్‌బాస్ బ్యూటీ అషురెడ్డి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. రెండేళ్ల క్రితం బ్రెయిన్‌లో టమాటా సైజులో ట్యూమర్ గుర్తించడంతో సర్జరీ చేయించుకున్న ఆమె.. ఆ సమయంలో ఎదుర్కొన్న నొప్పి, మానసిక వేదన గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగంగా వెల్లడించింది. సర్జరీ తర్వాత అరగుండు చేయడంతో నెల రోజుల పాటు అద్దంలో తన ముఖాన్ని కూడా చూసుకోలేకపోయానని చెప్పుకొచ్చింది. మరోవైపు, గతంలో కొన్ని పరిచయాల కారణంగా మద్యానికి అలవాటు పడిన తాను.. ఆరోగ్యంపై శ్రద్ధతో పూర్తిగా దూరమయ్యానని తెలిపింది. ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదని, భవిష్యత్తులో ఎప్పుడైనా అలాంటి ఆలోచన వస్తే అప్పుడు చూసుకుంటానని స్పష్టం చేసింది. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న అషురెడ్డి.. తన బ్రెయిన్ సర్జరీ, గత అనుభవాలు, డ్రింకింగ్ అలవాటు, పెళ్లి, సుడిగాలి సుధీర్‌తో ఉన్న అనుబంధంపై ఆసక్తికర విషయాలు పంచుకుంది.
పెళ్లంటే ఇష్టం లేదు..
టాలీవుడ్ నటి సురేఖావాణి కుమార్తె సుప్రీత హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షోకు అషురెడ్డి గెస్ట్‌గా హాజరైంది. ఈ సందర్భంగా పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ప్రస్తుతం తన మనసులోనే లేదని స్పష్టం చేసింది. పెళ్లి ప్రస్తావన రాగానే సరదాగా 'థూ' అంటూ స్పందించింది. అయితే భవిష్యత్తులో ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు ఆలోచిస్తానని చెప్పుకొచ్చింది. దీంతో అషురెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బ్యాడ్ పీపుల్‌తో పరిచయం.. మద్యానికి అలవాటు!
ఇక తన గతంలోని డ్రింకింగ్ అలవాటు గురించి కూడా అషురెడ్డి ఓపెన్‌గా మాట్లాడింది. గతంలో కొందరితో పరిచయాలు, వారి స్నేహంలో ఉన్న సమయంలో మందు తాగే అలవాటు ఏర్పడిందని తెలిపింది. అయితే అది తన జీవనశైలికి సరైనది కాదని, దాని వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని కొంతకాలానికి అర్థం చేసుకున్నట్లు చెప్పింది. దీంతో వెంటనే మద్యానికి పూర్తిగా స్వస్తి పలికినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నానని, ప్రతిరోజూ జిమ్‌కు వెళ్తూ ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నానని తెలిపింది. 'మన శరీరమే మనకు దేవాలయం. దాన్ని మనం ఎంత బాగా చూసుకుంటే.. అది ఎప్పటికైనా మనల్ని అంతే బాగా కాపాడుతుంది' అంటూ ఆరోగ్యం విషయంలో తన ఆలోచనా విధానాన్ని వివరించింది.
సుడిగాలి సుధీర్‌తో పెళ్లి..!
గతంలో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఫ్యామిలీ స్టార్స్ షోలో చేసిన స్కిట్లు కూడా అషురెడ్డికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా సుధీర్‌ను 'బావా' అని పిలవడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. వీరి పెళ్లి గురించి కూడా పలు రకాల వార్తలు వినిపించాయి. తాజాగా ఇదే విషయంపై సుప్రీత ప్రశ్నించగా అషురెడ్డి ఆసక్తికరంగా స్పందించింది. సుధీర్ చాలా మంచి వ్యక్తి అని, ఫ్యామిలీ స్టార్స్ షో కోసం దాదాపు రెండేళ్లుగా కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. ఆయన చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారని, షూటింగ్ సమయంలో ఎన్ని పంచులు వేసినా సీరియస్‌గా తీసుకోరని చెప్పింది. పని పూర్తయిన తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటామని వివరించింది. దీంతో సుధీర్‌తో తనకు ఉన్నది కేవలం వర్క్ పరమైన అనుబంధమేనని, ఇద్దరి మధ్య ప్రేమ, పెళ్లి అంటూ వస్తున్న వార్తలు రూమర్లేనని పరోక్షంగా స్పష్టం చేసింది.
హరికి బైక్ గిఫ్ట్.. కానీ ఇప్పటివరకు రైడ్ చేయలేదట!
ఇదే టాక్ షోలో మరో బుల్లితెర నటుడు హరి గురించి కూడా అషురెడ్డి మాట్లాడింది. అతను తనకు మంచి స్నేహితుడని, ప్రస్తుతం ఇద్దరూ కలిసి పనిచేయడం లేదని తెలిపింది. గతంలో హరికి ఓ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చానని, అయితే ఇప్పటివరకు తనను ఆ బైక్‌పై ఎక్కడికీ తీసుకెళ్లలేదని నవ్వుతూ చెప్పింది. మొత్తానికి పెళ్లి, గతంలోని అలవాట్లు, ఆరోగ్యంపై తన ఆలోచనలు, సుడిగాలి సుధీర్‌తో అనుబంధం.. ఇలా పలు విషయాలపై అషురెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా మద్యానికి పూర్తిగా దూరమై ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టానన్న ఆమె మాటలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
