EV విమానాలు వచ్చాయ్.. వినటానికి హాయిగా ఉన్నా.. ఆలోచించేకొద్దీ ఆందోళన పెరుగుతుంది.. ఏ బండో, కారునో అయితే ఛార్జింగ్ అయిపోతే నెట్టుకుని వెళ్లొచ్చు.. అక్కడి పడేసి తర్వాత తీసుకొచ్చుకోవచ్చు.. అది రోడ్డు కాబట్టి.. అదే గాల్లో ఉన్నప్పుడు ఛార్జింగ్ అయిపోతే.. దిగాల్సిన ఎయిర్ పోర్టు నుంచి అనుమతి లేకపోతే.. గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వస్తే పరిస్థితి ఏంటీ..
రోడ్డు మీద సైలెంట్‌గా దూసుకుపోయే ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌ల కాలం పోయి.. ఇక ఆకాశంలో ఎలక్ట్రిక్ విమానాలు గాల్లోకి ఎగిరే సరికొత్త శకం మొదలైంది. ఇప్పటివరకు మనమంతా భూమి మీద ఈవీ వాహనాల గురించే మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు చైనా సంచలనం సృష్టిస్తూ ఏకంగా 19 సీట్ల భారీ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ విమానాన్ని విజయవంతంగా గాల్లోకి టేకాఫ్ చేసింది. బ్యాటరీలతో నడిచే విమానాలను కమర్షియల్ విమానయాన రంగంలోకి తీసుకురావడంలో ఇది ఒక చారిత్రక మైలురాయి.
చైనాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ‘కామ్యాక్’ అభివృద్ధి చేసిన ఈ 10 టన్నుల బరువైన ‘CE-25A’ ఎలక్ట్రిక్ విమానం నవంబర్ 14న షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో తన తొలి పైలట్ సహిత విజయవంతమైన విమానయానాన్ని పూర్తి చేసుకుంది. ఇద్దరు పైలట్లు, ఒక ఫ్లైట్-టెస్ట్ ఇంజనీర్‌తో ఈవీ విమానం గాల్లోకి ఎగిరింది. ఈ టెస్ట్ ఫ్లైట్ దాదాపు 57 నిమిషాల 46 సెకండ్ల పాటు సాగింది. ఇందులో విమానం 16 నిమిషాల 38 సెకండ్లు గాల్లోనే ఉంటూ 60.4 కిలోమీటర్ల దూరాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా కవర్ చేసింది.
సాధారణ ప్రయాణికుల విమానాలు ఫ్యూయల్-పవర్డ్ జెట్ ఇంజిన్లు, టర్బోప్రెప్ ఇంజిన్లపై ఆధారపడతాయి. కానీ ఈ CE-25A విమానం మాత్రం పూర్తిగా భిన్నమైన ‘డిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రిక్ డక్టెడ్-ఫ్యాన్ ప్రొపల్షన్ సిస్టమ్’పై పనిచేస్తుంది. దీని రెక్కల వెంట అమర్చిన బలమైన ఎలక్ట్రిక్ ఫ్యాన్లు బ్యాటరీల సహాయంతో శక్తిని పొందుతూ విమానాన్ని ముందుకు నడిపిస్తాయి. ఈ విమానం గరిష్టంగా గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అలాగే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని గరిష్ట టేకాఫ్ బరువు 10 టన్నులు కాగా.. గరిష్టంగా 2,400 మీటర్ల ఎత్తులో ఇది ప్రయాణించగలదు.
చైనాకు చెందిన ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ CATL, షాంఘై జియావో టోంగ్ యూనివర్సిటీ సహకారంతో ఈ విమానాన్ని రూపొందించారు. భవిష్యత్తులో మరింత పెద్ద ఎలక్ట్రిక్ కమర్షియల్ విమానాలను తయారు చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ కొనసాగుతోంది. చైనా సివిల్ ఏవియేషన్ అథారిటీ ఇప్పటికే దీని టైప్ సర్టిఫికేట్ దరఖాస్తును అంగీకరించడం విశేషం. ఈ పరిణామంతో భవిష్యత్తులో గ్రీన్ అండ్ క్లీన్ ఏవియేషన్ రంగానికి పెద్దపీట వేస్తూ.. సాధారణ ప్రయాణికులు కూడా ఎలక్ట్రిక్ విమానాల్లో ప్రయాణించే రోజులు ఎంతో దూరంలో లేవని చైనా ప్రయత్నాలు నిరూపిస్తున్నాయి.
Chinese state-owned aircraft manufacturer COMAC completed the first crewed flight of its CE-25A electric aircraft in Binzhou, state broadcaster CCTV reported https://t.co/Bh49hvp8Tm
— Reuters (@Reuters) November 14, 2026
