జెన్ జీ.. ఈ తరం యువతపై సోషల్ మీడియా, OTT క్రైం స్టోరీల ప్రభావం గట్టిగానే ఉంది.. చంపటం అంటే వాళ్లకు చాలా కామన్ అయ్యింది. వయస్సుతో నిమితం లేదు.. చిన్నా పెద్దా తేడా లేదు.. అబ్బాయా అమ్మాయా అనే విషయంలో పట్టింపు లేదు.. నచ్చలేదు అంటే చంపేయటమే.. ఇలా తయారు అయ్యింది సమాజం. కేరళ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఆ అమ్మాయి వయస్సు జస్ట్ 19 ఏళ్లు మాత్రమే.. ఆ అమ్మాయికి ఓ లవర్ ఉన్నాడు.. ఆ లవర్ ను వదిలించుకోవాలని చూసింది.. వదిలేస్తున్నాను అని సింపుల్ గా చెప్పొచ్చు కదా.. అలా చెప్పటానికి కూడా ఇష్టం లేకుండా పోయింది ఆ అమ్మాయికి.. లవర్ ను కిడ్నాప్ చేసి.. అతని దగ్గర ఉన్న డబ్బు దోచుకుని.. ఆ తర్వాత చంపేయాలని పెద్ద స్కెచ్ వేసింది.. ఏంటీ.. ఇది నిజమా అని నోరెళ్లబెడుతున్నారు కదా.. అవునుండీ అక్షరాల జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియుడిని వదిలించుకోవాలనే ఉద్దేశంతో 19 ఏళ్ల యువతి తన స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్ వేసింది. ఇందుకోసం ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులకి సుపారీ ఇచ్చింది. ప్రియుడిని రహస్యంగా ఒక చోటికి రప్పించి, అక్కడి నుంచి కిడ్నాప్ చేసి దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అర్ధరాత్రి ప్రియుడికి ఫోన్ చేసి..
ఈ ఘటనలో ప్రధాన నిందితురాలిగా పాలక్కాడ్ జిల్లా పట్టాంబికి చెందిన సఫానా (19)ను పోలీసులు గుర్తించారు. ఆమెకు తిరూర్ ప్రాంతానికి చెందిన నదియా (20), రబీబా (25)తో పాటు ఇర్షాద్ (28), అజరుద్దీన్ (25) సహకరించారు.
పోలీసుల కథనం ప్రకారం.. సఫానా తన ప్రియుడికి ఎలాంటి అనుమానం రాకుండా ప్లాన్ చేసి.. అర్ధరాత్రి సమయంలో అతడిని మలప్పురంలోని తిరూర్కు రప్పించింది. అక్కడ ముందుగానే ఉన్న నిందితుల్లో ఒకరు అతడి దగ్గరకు వెళ్లి, సఫానా వద్దకు తీసుకెళ్తానని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన ప్రియుడు అతడితో కలిసి బైక్ ఎక్కాడు. అయితే అతడికి తెలియని విషయం ఏమిటంటే.. అప్పటికే అక్కడ మిగతా నిందితులు కూడా అతడి కోసం ఎదురుచూస్తున్నారు.
బైక్పై వెళ్లిన యువకుడికి ఊహించని షాక్
అక్కడికి చేరుకున్న తర్వాత నిందితులు అతడిని బలవంతంగా కారులోకి ఎక్కించినట్లు పోలీసులు తెలిపారు. తరువాత కారులోనే అతడిపై దారుణంగా దాడి చేశారు. అతడి మొబైల్ ఫోన్ను కూడా లాక్కున్నారు. అంతేకాదు, అతడిని హత్య చేసేందుకు కూడా ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
దాడి తరువాత తీవ్రంగా గాయపడిన ప్రియుడిని అర్ధరాత్రి సమయంలో తాళెపాలెం నది ఒడ్డున రోడ్డు పక్కన వదిలేసి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. తనకు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితిలో ఉన్న ప్రియుడు.. ఎలాగోలా పోలీసులను సంప్రదించి తనపై జరిగిన దాడి గురించి సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
బాధితుడి ఫిర్యాదుతో ఐదుగురు అరెస్ట్
యువకుడి నుంచి సమాచారం అందుకున్న తిరూర్ పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి.. బుధవారం తెల్లవారుజామున తాళెపాలెం సమీపంలో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుంది. వారిని సఫానా, నదియా, రబీబా, ఇర్షాద్, అజరుద్దీన్గా గుర్తించారు. అనంతరం ఐదుగురినీ తిరూర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది.
నిందితుల క్రిమినల్ రికార్డులు చూసి షాక్!
ఈ కేసులో మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. దాడిలో పాల్గొన్న ఇద్దరు పురుషులపై గతంలోనే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇర్షాద్, అజరుద్దీన్లపై మాదకద్రవ్యాల అక్రమ రవాణా, హత్యాయత్నం, తీరప్రాంతాల్లో హింసాత్మక దాడులకు సంబంధించిన కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గతంలో వీరిద్దరూ జైలు శిక్ష కూడా అనుభవించారని తెలిపారు. అంతేకాదు, కేరళ సంఘ విద్రోహ కార్యకలాపాల నిరోధక చట్టం (KAAPA) కింద కూడా వీరు విచారణలను ఎదుర్కొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
అసలు ప్రియుడిని చంపాలనుకునేంత కక్ష ఎందుకు?
ప్రస్తుతం పోలీసులు సఫానా తన ప్రియుడిని ఎందుకు వదిలించుకోవాలనుకుంది? ఇద్దరి మధ్య గతంలో ఏమైనా గొడవలు జరిగాయా? ఈ దాడికి ముందే ఏదైనా వివాదం జరిగిందా ? అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
