లిస్టులో లేని 72 కోడి గుడ్లు ఆర్డర్ చేసిన AI ఏజెంట్: అడిగితే సింపుల్‌గా సారీ చెబుతోంది..!

లిస్టులో లేని 72 కోడి గుడ్లు ఆర్డర్ చేసిన AI ఏజెంట్: అడిగితే సింపుల్‌గా సారీ చెబుతోంది..!

ఏఐ ఏజెంట్లు మన పనులు సులువు చేసేస్తాయని గుడ్డిగా నమ్ముతున్న ఈ రోజుల్లో.. ఆ టెక్నాలజీయే మన కొంప ముంచితే పరిస్థితి ఎలా ఉంటుంది? అవును తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వింత సంఘటన ఇదే నిజమని నిరూపిస్తోంది. ఒక వ్యక్తి తన కిరాణా సామాన్లు ఆర్డర్ చేయడానికి ఏఐ ఏజెంట్‌ను ఆశ్రయిస్తే.. ఆ షాపింగ్ ఏజెంట్ ఏకంగా 72 గుడ్లను ఆర్డర్ కార్ట్‌లో యాడ్ చేసింది. అసలు ఆ జాబితాలోనే గుడ్ల ప్రస్తావన లేకపోయినా ఏఐ చేసిన పనికి సదరు ఓనర్ షాక్ అయ్యాడు.

‘రెబెలియైర్’ సంస్థలో పనిచేస్తున్న మాట్ స్మిత్ అనే వ్యక్తి తన షాపింగ్ లిస్టును ఏఐ ఏజెంట్‌కు ఇచ్చి కిరాణా సరుకులు ఆర్డర్ చేయమన్నాడు. ఆ లిస్ట్‌లో ఎక్కడా గుడ్లు అనే మాటే లేదు. కానీ ఏఐ ఏజెంట్ మాత్రం 72 కోడి గుడ్లను కార్ట్‌లో యాడ్ చేసింది. స్మిత్ కూడా గమనించకుండానే చెక్‌అవుట్ పూర్తి చేశాడు. ఇది తన జీవితంలో ఒక ‘ఎల్ఎల్‌ఎం హ్యాలుసినేషన్’ వల్ల నిజ జీవితంలో ఎదురైన మొదటి పరిణామమని ఆయన ఎక్స్‌లో షేర్ చేశారు. 

అసలు ఇన్ని గుడ్లు ఎందుకు ఆర్డర్ చేశావని స్మిత్ ఆ ఏఐని నిలదీయగా.. మొదట అది తన షాపింగ్ లిస్ట్ ఫోటోలో ఏదో లైన్‌ను తప్పుగా చదివానని కవర్ చేసే ప్రయత్నం చేసింది. అయితే అలాంటి లైనేదీ లేదని స్మిత్ చెప్పడంతో ఏఐ తన తప్పును ఒప్పుకుంది. "నా దగ్గర సరైన సమాధానం లేదు, 4 సంఖ్యను ఎందుకు ఎంచుకున్నానో వివరించే నోట్ ఏదీ దొరకలేదు. ఎలాంటి కారణం లేకుండానే వాటిని యాడ్ చేశాను, ఇది నా తప్పే అంటూ ఏఐ ఏజెంట్ సమాధానం ఇవ్వడం షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఏ ఏఐ మోడల్ వాడారనే వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ.. ఈ ఘటన టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ప్రస్తుతం టెక్ కంపెనీలు షాపింగ్ చేయడం, టికెట్లు బుక్ చేయడం, ఫార్మ్స్ నింపడం వంటి పనుల కోసం ఏఐ ఏజెంట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అయితే ఇలాంటి ఏఐ తప్పుల వల్ల వినియోగదారులు అనవసరంగా నష్టపోవాల్సి వస్తోంది. కాబట్టి ఏఐ ఏజెంట్లను గుడ్డిగా నమ్మి పనులు అప్పగిస్తే ఇలాంటి అనర్థాలు తప్పవు. షాపింగ్ చేసేటప్పుడు కార్ట్‌ను సరిచూసుకోవడం, ఏఐ ఏజెంట్ ఏయే ఐటమ్స్ ఎందుకు యాడ్ చేసిందో ప్రశ్నించడం, అలాగే ప్రతీ ఆర్డర్‌కు ఒక స్పష్టమైన ఖర్చు పరిమితిని సెట్ చేసుకోవడం చాలా ముఖ్యం.