అదృష్టం అంటే దీన్నే అంటారు భయ్యా. ఉద్యోగం నుంచి మానేద్దాం అనుకుంటున్న టెక్కీకి.. ఏకంగా కంపెనీయే లేఆఫ్స్ రూపంలో భారీ వరం ప్రసాదించింది. నరకంలా మారిన టాక్సిక్ వర్క్ ప్లేస్ నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్న ఆ టెక్కీకి క్వాల్కామ్ లేఆఫ్స్ ఒక "అదృష్టంలా" కలిసివచ్చాయి. ఏకంగా 15 నెలల జీతానికి సరిపడా భారీ ఎగ్జిట్ ప్యాకేజీతో ఉద్యోగం నుంచి బయటపడటం నెట్టింట వైరల్ అవుతోంది.
భారతదేశంలో భారీ ఎత్తున ఉద్యోగాలను తొలగిస్తున్న చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్ గ్లోబల్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా సుమారు 3వేల 600 మందిని ఇంటికి పంపించేసింది. ఇందులో భాగంగానే ఇండియాలోనూ దాదాపు వెయ్యి మంది ఉద్యోగులపై వేటు పడుతోంది. ఐదేళ్లుగా క్వాల్కామ్లో సీనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆ ఉద్యోగి కూడా ఈ లేఆఫ్స్ జాబితాలో చేరాలని స్వయంగా కోరుకోవడం విశేషం. సొంతూరికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో వేరే టీమ్‌కు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అయిన ఆ ఇంజనీర్‌కు ఆ తర్వాత నరకం అనుభవంలోకి వచ్చింది. తోటి ఉద్యోగుల నుంచి వేధింపులు.. టెక్నికల్ స్కిల్స్‌పై విమర్శలు, వ్యక్తిగత దాడులతో తీవ్ర మానసిక క్షోభను అనుభవించారు.
ఈ తరుణంలో కంపెనీ లేఆఫ్స్ ప్రకటన చేయగానే.. సదరు ఇంజనీర్ తన డైరెక్టర్ అలాగే మేనేజర్‌ను సంప్రదించి తనను కూడా ఈ జాబితాలో చేర్చమని కోరారు. ఆ ఉద్యోగి ఊహించినట్లుగానే కంపెనీ అతనికి లేఆఫ్ ప్రకటించింది. అయితే ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. మూడు నెలల స్టాండర్డ్ సెవెరెన్స్, మూడు రోజుల్లోగా పేపర్‌వర్క్ పూర్తి చేసినందుకు అదనంగా ఒక నెల, పనిచేసిన రోజులకు ఐదు నెలలు, అలాగే రీలోకేషన్ బోనస్ రూపంలో మరో రెండు నెలల మొత్తం లభించింది. ఇవేకాక 1-2 నెలల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, జనవరి వరకు రెగ్యులర్ జీతం కలిపి మొత్తం దాదాపు 15 నెలల జీతానికి సరిపడేంత సొమ్ముతో బయటకు వచ్చేశాడు.
జాబ్ పోవటంతో ఏమాత్రం టెన్షన్ పడకుండా, తొందరపడి కొత్త ఉద్యోగం వెతుక్కోకుండా.. హాయిగా కుటుంబ సభ్యులతో గడపాలని ఆ టెక్కీ నిర్ణయించుకున్నారు. టాక్సిక్ కల్చర్ నుంచి బయటపడటమే కాకుండా.. భారీ మొత్తంలో నష్టపరిహారం కూడా అందడంతో నెట్టింట ఈ స్టోరీ తెగ వైరల్ అవుతోంది. టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ శాపంగా మారుతున్న ఈ రోజుల్లో కొందరికి మాత్రం ఇవి ఇలా 'అదృష్ట వరం'లా మారుతుండటం గమనార్హం.
