ఆంధ్రప్రదేశ్ కు మరో తుఫాన్ ముప్పు పొంచిఉంది. ఆగ్నేయ, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఈ తీవ్ర వాయుగుండం 2026 నవంబర్ 16 ( సోమవారం) సాయంత్రానికి దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నాయని పేర్కొంది.
గత ఆరు గంటల్లో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ వాయుగుండం ప్రస్తుతం చెన్నైకు 700 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 800 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ నవంబర్ 20వ తేదీ శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు–తుని మధ్య అతి తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు.
భారీ నుంచి అతి భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. సోమవారం సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు
తుపాను హెచ్చరికలు ఉన్న క్రమంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
