TTD News: కలియుగ బ్రహ్మాండం... ఎస్వీ మ్యూజియం.. తిరుమల చరిత్రకు సరికొత్త వైభవం

TTD News: కలియుగ బ్రహ్మాండం... ఎస్వీ మ్యూజియం.. తిరుమల చరిత్రకు సరికొత్త వైభవం

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల క్షేత్రం ఆధ్యాత్మికతకు మాత్రమే కాదు.. అద్భుతమైన చరిత్రకు, అపురూపమైన శిల్పకళా సంపదకు, సనాతన ధర్మ వైభవానికి కూడా నిలయం. తరతరాలుగా భక్తులు ఆరాధిస్తున్న శ్రీవారి దివ్యక్షేత్ర విశిష్టతను, వేల సంవత్సరాల చారిత్రక వారసత్వాన్ని, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఒకే చోట ఆవిష్కరించే అద్భుత వేదికగా తిరుమలలో నూతనంగా ఆధునీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం రూపుదిద్దుకుంది.

ఒకవైపు భక్తి భావాన్ని పెంపొందిస్తూ.. మరోవైపు చరిత్రను కళ్లకు కడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విశ్వ రహస్యాలను పరిచయం చేస్తూ రూపొందించిన ఈ మ్యూజియం నిజంగా ఒక కలియుగ బ్రహ్మాండం..

లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో.. 14 అద్భుత గ్యాలరీలు

తిరుమలలో  లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తులుగా ఎస్వీ మ్యూజియాన్ని ఆధునీకరించారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సాంకేతిక సహకారంతో రూపొందించిన ఈ మ్యూజియంలో 14 ప్రత్యేక గ్యాలరీలు ఉన్నాయి. సుమారు 8వేలకు పైగా పురాతన కళాఖండాలు, చారిత్రక వస్తువులు, శిల్పాలు, అరుదైన సంపదతో పాటు డిజిటల్ ప్రదర్శనలు సందర్శకులకు కనువిందు చేయనున్నాయి.

 ఈ మ్యూజియంలోని ప్రతి గ్యాలరీ ఒక ప్రత్యేక అంశాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు.  శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్యరూపం, ఆలయ చరిత్ర, భారతీయ శిల్పకళ, దేవాలయ నిర్మాణ వైభవం, సంగీతం, నృత్యం, పూజా సంప్రదాయాలు, పురాతన ఆయుధాలు ఇలా విభిన్న అంశాలు ఇక్కడ కొలువుదీరాయి.

శిల్పకళా వైభవం.. చరిత్రకు సజీవ సాక్ష్యం

భారతీయ సంస్కృతిలో శిల్పకళకు ప్రత్యేక స్థానం ఉంది. రాతి శిల్పాలు, కాంస్య విగ్రహాలు ఆనాటి కళాకారుల నైపుణ్యానికి, భక్తి భావానికి ప్రతీకలు. మ్యూజియంలోని స్టోన్ స్కల్ప్చర్, బ్రాంజ్ స్కల్ప్చర్ గ్యాలరీలు ఈ కళా వైభవాన్ని సందర్శకులకు పరిచయం చేసేలా ఉన్నాయి.

దేవాలయ నిర్మాణ శైలి, శిల్పాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావనలు, శతాబ్దాల నాటి కళా సంప్రదాయాలను తెలుసుకునే అవకాశం ఇక్కడ లభిస్తుంది. తిరుమల ఆలయ నిర్మాణ చరిత్ర, దాని పరిణామ క్రమం, దాతలు అందించిన కానుకలు, పూజా విధానాలకు సంబంధించిన అంశాలు భక్తులకు విశేష ఆసక్తిని కలిగిస్తాయి.

 

అన్నమయ్య సంకీర్తనల నుంచి ఆధ్యాత్మిక సంగీతం వరకు

తెలుగు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన వేలాది సంకీర్తనలు శ్రీవారి భక్తి వైభవాన్ని ప్రపంచానికి చాటాయి. అన్నమయ్య, నాణేల చరిత్రకు సంబంధించిన గ్యాలరీతో పాటు సంప్రదాయ సంగీత వాయిద్యాల ప్రదర్శన కూడా మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.భారతీయ సంగీతం, నృత్యం, శిల్పకళల సమ్మేళనాన్ని ప్రతిబింబించే ప్రదర్శనలు మన కళా వారసత్వాన్ని కొత్త తరాలకు పరిచయం చేస్తాయి.

బ్రహ్మాండం గ్యాలరీ.. విశ్వాన్ని ఆవిష్కరించే అద్భుతం

ఈ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది బ్రహ్మాండం గ్యాలరీ. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రూపొందించిన ఈ గ్యాలరీలో విశ్వం, సృష్టి రహస్యాలు, బ్రహ్మాండ విస్తృతి వంటి అంశాలను వినూత్నంగా ఆవిష్కరించనున్నారు.

హోలోగ్రాఫిక్ ప్రదర్శనలు, 360 డిగ్రీల సౌండ్ అనుభూతి, డిజిటల్ విజువల్స్ వంటి ఆధునిక సాంకేతికతతో సందర్శకులకు సరికొత్త అనుభవాన్ని అందించనుంది. సాధారణంగా పుస్తకాల్లో చదివే విశ్వ సంబంధిత అంశాలను దృశ్యానుభూతి ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించడం ఈ గ్యాలరీ ప్రత్యేకత.

ఆధ్యాత్మికతకు ఆధునికత జోడింపు

గత వైభవాన్ని భద్రపరచడమే కాకుండా, దానిని భావితరాలకు అర్థమయ్యే రీతిలో అందించడమే ఆధునిక మ్యూజియంల లక్ష్యం. ఈ దిశగా ఎస్వీ మ్యూజియంలో సంప్రదాయ కళాఖండాలతో పాటు డిజిటల్ ఆర్కైవ్స్, ఆధునిక ప్రదర్శన సాంకేతికతకు ప్రాధాన్యం కల్పించారు.భక్తులు కేవలం ప్రదర్శన వస్తువులను చూడటమే కాకుండా వాటి వెనుక ఉన్న చరిత్ర, విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను తెలుసుకునేలా ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దారు.

భావితరాలకు తిరుమల వారసత్వ సంపద

నేటి తరానికి తిరుమల చరిత్రను పరిచయం చేయడంతో పాటు భావితరాలకు అపురూపమైన వారసత్వ సంపదను అందించడం ఈ మ్యూజియం ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా విద్యార్థులు, పరిశోధకులు, చరిత్రకారులు, కళాభిమానులకు ఇది ఒక విజ్ఞాన భాండాగారంగా ఉపయోగపడనుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తిరుమల క్షేత్ర చరిత్ర, ఆలయ సంప్రదాయాలు, శిల్పకళా వైభవం, సనాతన సంస్కృతిని మరింత లోతుగా తెలుసుకునేందుకు ఈ మ్యూజియం చక్కని అవకాశాన్ని కల్పించనుంది.

టీటీడీ ఆధ్వర్యంలో వారసత్వ పరిరక్షణకు మరో ముందడుగు

తిరుమల క్షేత్ర పవిత్రతను, చారిత్రక సంపదను పరిరక్షిస్తూ భక్తులకు మరింత సమగ్ర అనుభూతిని అందించాలనే లక్ష్యంతో టీటీడీ ఈ మ్యూజియాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆధునీకరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రబాబు  సెప్టెంబర్ 16న నూతన మ్యూజియాన్ని ప్రారంభించారు. 

నవంబర్ 16 నుంచి సాధారణ భక్తుల సందర్శనకు అందుబాటులోకి రానున్న ఈ మ్యూజియానికి ప్రవేశ రుసుమును రూ.50గా టీటీడీ నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు భక్తులు మ్యూజియంను సందర్శించేందుకు వీలుగా ఉంటుంది. సాయంత్రం 4 గంటల వరకు టికెట్లు కేటాయించడం జరుగుతుంది.

భక్తి, చరిత్ర, కళ, సంస్కృతి, విజ్ఞానం, సాంకేతికత.. ఇలా ఎన్నో విశిష్టతల సమాహారంగా రూపుదిద్దుకున్న ఎస్వీ మ్యూజియం తిరుమల క్షేత్రానికి మరో ఆధ్యాత్మిక ఆకర్షణగా నిలవనుంది. శ్రీవారి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందిస్తే.. ఈ మ్యూజియం ఆ దివ్యక్షేత్రం వెనుక ఉన్న అపారమైన చరిత్రను, సంస్కృతిని, బ్రహ్మాండమైన వైభవాన్ని పరిచయం చేయనుంది. ఇది కేవలం ఒక మ్యూజియం కాదు.. కలియుగ దైవం కొలువైన దివ్యక్షేత్ర చరిత్రను, భారతీయ సనాతన సంస్కృతిని, విశ్వ వైభవాన్ని ఒకే చోట ఆవిష్కరించే కలియుగ బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంది