వెలుగు లిటరేచర్: విద్యలో నీతికథల అవసరం  పెరిగింది! 

వెలుగు లిటరేచర్: విద్యలో నీతికథల అవసరం  పెరిగింది! 

ఒకప్పుడు  పల్లెల్లో వేసవి కాలం వచ్చిందంటే చాలు... వెన్నెల రాత్రుల్లో  పౌరాణిక నాటకాలు, చిందు యక్షగానాలు, హరికథలు, బుర్రకథలు వినిపించేవి.  హరిశ్చంద్రుడి సత్యనిష్ఠ, రాముడి ధర్మం, కృష్ణుడి నీతి, కుటుంబ బంధాలు, మానవ సంబంధాల గొప్పతనం కథల రూపంలో ప్రజల ముందుకు వచ్చేవి.  పిల్లలు పెద్దలతో కలిసి వాటిని చదివి ఆనందించేవారు. వినోదంతోపాటు జీవిత పాఠాలను నేర్చుకునేవారు. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. కుటుంబ సభ్యులందరినీ  ఒకచోట  కూర్చోబెట్టే కథలు  కనుమరుగవుతున్నాయి. వాటి స్థానంలో టీవీ సీరియళ్లు, హింసాత్మక దృశ్యాలు, ప్రతీకారాలు, కుట్రలు,  నేరాలు ప్రధాన వినోదంగా మారుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లోనూ హింసను  సాధారణ విషయంగా చూపించే దృశ్యాలు పిల్లలకు సులభంగా అందుబాటులో ఉంటున్నాయి.  

ప్రతి సీరియల్ చెడ్డదని చెప్పడం కాదు.  కానీ పిల్లల మనసులపై ఎలాంటి ప్రభావం పడుతోందో పెద్దలు గుర్తించాలి.  ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తించాలి.  పాఠశాలలు కేవలం మార్కులు సంపాదించే కేంద్రాలుగా మారకూడదు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు మానవత్వం, సహనం, క్రమశిక్షణ, క్షమాగుణం, ఇతరుల పట్ల గౌరవం నేర్పాలి. పిల్లల్లో కోపం, ఒంటరితనం, దూకుడు, హింసాత్మక ప్రవర్తన కనిపిస్తే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేయకుండా వారితో  ప్రేమపూర్వకంగా మాట్లాడాలి. అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవాలి.

పిల్లల ఆలోచనలను మార్చే నీతికథలు

కథలు మనిషి ఆలోచనలను మార్చగలవు. ఒక మంచి కథ పిల్లల మనసులో చెరగని ముద్ర వేయగలదు. తోటి మనిషి బాధను అర్థం చేసుకునేలా చేయగలదు. తప్పు చేస్తే పశ్చాత్తాపపడాలని, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలని, కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని నేర్పగలదు. అందుకే పిల్లలకు కథలు చెప్పడం అనేది కేవలం కాలక్షేపం కాదు.  అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పే నీతి కథలు మళ్లీ ఇంటింటికీ చేరాలి. తల్లిదండ్రులు పిల్లలతో  కొంత సమయం గడపాలి.  రోజుకు కనీసం ఒక మంచి కథ చదివి వినిపించాలి. 

పాఠశాలల్లో కథల పోటీలు, నాటక ప్రదర్శనలు, పుస్తక పఠనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. పిల్లలకు మంచి పుస్తకాలను పరిచయం చేయాలి.  ముఖ్యంగా కవులు, రచయితలు, కళాకారులు తమ బాధ్యతను గుర్తించాలి.  సమాజంలోని సమస్యలను ప్రతిబింబించడంతోపాటు పరిష్కార మార్గాలను చూపించే రచనలు రావాలి. కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, మానవత్వం, ప్రకృతి ప్రేమ, దేశభక్తి, సామాజిక బాధ్యత వంటి అంశాలపై కొత్త తరానికి నచ్చేలా కథలు, నాటకాలు, పాటలు రూపొందించాలి. కనుమరుగవుతున్న జానపద కళలకు మళ్లీ జీవం పోయాలి. 

విద్యలో నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి

ప్రభుత్వాలు కూడా పాఠశాల విద్యలో నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి.  బాలల మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి.  హింసాత్మక కంటెంట్ ప్రభావం నుంచి పిల్లలను కాపాడేందుకు కుటుంబాలు, పాఠశాలలు, సమాజం కలిసి పనిచేయాలి.  నేరం జరిగిన తర్వాత శిక్షించడం ఎంత అవసరమో, అలాంటి నేరాలకు దారితీసే పరిస్థితులను ముందుగానే గుర్తించి నివారించడం అంతకంటే ముఖ్యం.   పిల్లలకు ఆస్తులు కూడబెట్టడం కోసం జీవితమంతా కష్టపడుతున్నాం. కానీ వారికి మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు, మంచి సంస్కారం అందించడానికి ఎంత సమయం కేటాయిస్తున్నాం? ఈ ప్రశ్న ప్రతి తల్లిదండ్రులు తమను తాను వేసుకోవాలి.  

పిల్లల చేతిలో కత్తులు, రంపాలు కాకుండా పుస్తకాలు ఉండాలి. వారి ఆలోచనల్లో ప్రతీకారం కాకుండా ప్రేమ ఉండాలి.  కథలు చెప్పడం మానేశాం,  కళలను ఆదరించడం మరిచిపోయాం,  కుటుంబంతో గడపడం తగ్గించాం.  ఫలితంగా ఇప్పుడు  పరిస్థితులు అదుపు తప్పుతుంటే పిల్లల ప్రవర్తనపై ఆందోళన చెందుతున్నాం.


ఇప్పటికైనా మేల్కొందాం...పిల్లలలో మానవత్వాన్ని నింపుదాం!

కవులారా... మీ కలాలకు పదును పెట్టండి.  రచయితలారా... సమాజానికి దిశానిర్దేశం చేసే కథలు రాయండి. కళాకారులారా... కనుమరుగవుతున్న కళలకు ప్రాణం పోయండి. తల్లిదండ్రులూ మీ పిల్లలకు సమయం కేటాయించండి. ఉపాధ్యాయులారా... పాఠాలతోపాటు జీవిత పాఠాలూ విద్యార్థులకు నేర్పండి. మంచి కథ ఒక మనిషిని మార్చగలదు. మంచి సంస్కారం ఒక కుటుంబాన్ని మార్చగలదు. మంచి తరం ఒక సమాజాన్ని మార్చగలదు.  మన పిల్లలకు మంచి కథలిద్దాం. వారిలో మానవత్వాన్ని నింపుదాం. భవిష్యత్తు సమాజాన్ని హింసకు దూరంగా, మానవీయ విలువలకు దగ్గరగా తీర్చిదిద్దుదాం!

 
- తాళ్ళపెళ్లి సురేందర్, జర్నలిస్ట్