వెలుగు లిటరేచర్: చరిత్రను సాహిత్యంగా మలిచిన.. సృజనశీలి ఆచార్య ముదిగొండ!

వెలుగు లిటరేచర్: చరిత్రను సాహిత్యంగా మలిచిన.. సృజనశీలి ఆచార్య ముదిగొండ!

 ఒక నవల చదువుతుంటే.. వందల ఏళ్ల క్రితం నాటి ప్రపంచంలోకి వెళ్లగలమా? అప్పటి మనుషుల జీవితాలను తెలుసుకోవచ్చా? ఆనాటి రాజ్యాలు, రాజకీయాలు, సామాజిక పరిస్థితులను కళ్లముందు చూసిన అనుభూతిని పొందగలమా?  ఇదిగో వీరి నవలలు చదివితే తప్పకుండా ఆ అనుభూతి పొందగలం. చారిత్రక సంఘటనలను ఆసక్తికరమైన కథనాలుగా మలిచి, గతకాలపు జీవితాలను పాఠకుల కళ్లముందు నిలిపిన చారిత్రిక నవలా చక్రవర్తి.. ఆచార్య ముదిగొండ శివప్రసాద్‌‌‌‌‌‌‌‌!  చరిత్రలోని విశేషాలను సామాన్య పాఠకులకు సైతం అర్థమయ్యేలా చెబుతూ, ఆయా కాలాల సంస్కృతి, సామాజిక జీవనం, రాజకీయ పరిణామాలను ఆయన తన రచనల్లో ప్రతిబింబించారు. ఆయన నవలలు చదువుతుంటే చరిత్రను చదువుతున్నామనే భావన కంటే,  ఆ కాలంలో  మనమూ జీవిస్తున్నామనే అనుభూతి కలుగుతుంది. 

తెలుగు సాహిత్యంలో చారిత్రక నవలకు విశిష్టమైన గుర్తింపును తీసుకొచ్చిన ఆచార్య ముదిగొండ శివప్రసాద్‌‌‌‌‌‌‌‌ మరణం.. ఇప్పుడు సాహితీ లోకంలో తీరని లోటుగా మిగిలిపోయింది. ‘రాజు మరణించె ఒక తార రాలిపోయే.. సుకవి మరణించె ఒక తార గగనమెక్కె’ అని జాషువా చెప్పినట్టుగా.. రచయిత భౌతికంగా దూరమైనా, ఆయన సృష్టించిన పాత్రలు, ఆవిష్కరించిన చారిత్రక ఘట్టాలు, అక్షరాల్లో నిక్షిప్తం చేసిన భావాలు పాఠకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన కలం నుంచి వెలువడిన రచనలు రాబోయే తరాలకు చరిత్రను పరిచయం చేస్తూనే ఉంటాయి. ఒక తరం నుంచి మరో తరానికి సాహిత్య వారసత్వాన్ని అందించే శక్తి అక్షరాలకు ఉంది. ఆ అక్షరాల ద్వారానే రచయితలు కాలాన్ని దాటి మనతో మాట్లాడుతుంటారు.  ఈ నేపథ్యంలో, ముదిగొండ గారి సాహిత్య ప్రస్థానాన్ని, చారిత్రక నవలా రచయితగా ఆయన సాధించిన విశిష్టతను, తెలుగు సాహిత్యానికి ఆయన అందించిన సేవలను మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది!

చరిత్ర అంటే ఆయా కాలాల్లో  మనుషుల జీవిత సమాహారం

భారతీయులకు, ముఖ్యంగా తెలుగువారికి తమ చరిత్రపై అవగాహన కల్పించాలనే ఆలోచనతో ఆయన చారిత్రక నవలల రచనకు శ్రీకారం చుట్టారు. చరిత్ర అంటే కేవలం రాజుల పేర్లు, యుద్ధాలు, రాజ్యాల విస్తరణ మాత్రమే కాదని, ఆయా కాలాల్లోని మనుషుల జీవితం, వారి ఆలోచనలు, సంబంధాలు, సంఘర్షణల సమాహారమని తన రచనల ద్వారా చాటిచెప్పారు. సామాన్య పాఠకులు సైతం ఆసక్తిగా చదువుతూ చరిత్రను సులభంగా అర్థం చేసుకోగలగాలన్నదే ఆయన రచనల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.  

విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహశాస్త్రి వంటి ప్రముఖ రచయితల సాహిత్యం ఆయనపై ప్రభావం చూపింది. అయితే, చారిత్రక నవలా రచయితగా ఆయన తనదైన మార్గాన్ని ఏర్పరచుకున్నారు. చరిత్రలోని ఆసక్తికరమైన ఘట్టాలను ఎంచుకోవడం, వాటికి అవసరమైన వివరాలను అధ్యయనం చేయడం, వాటిని నవలా రూపంలో పాఠకులకు అందించడం ఆయన రచనా ప్రక్రియలో ముఖ్యమైన అంశాలు. ఈ క్రమంలోనే మాలిక్ కాఫర్, ఆవాహన, శ్రీపదార్చన, పట్టాభి, రెసిడెన్సీ, శ్రావణి, శ్రీలేఖ, తంజావూరు విజయం, వంశధార వంటి ఎన్నో నవలలు తెలుగు పాఠకులకు పరిచయమయ్యాయి.

ఈ  నవలల్లో  ఒక్కో చారిత్రక  కాలాన్ని,  ఒక్కో సామాజిక నేపథ్యాన్ని ఆయన విభిన్న కోణాల్లో ఆవిష్కరించారు. ముఖ్యంగా  కాకతీయుల చరిత్ర, దక్షిణ భారత రాజ్యాల రాజకీయ పరిణామాలు, రాజవంశాల మధ్య సంబంధాలు, అధికార పోరా టాలు వంటి అంశాలు ఆయన రచనల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

చరిత్రకు సాహిత్య సౌందర్యాన్ని జోడించి...

చారిత్రక వ్యక్తులను కేవలం గొప్పవారిగా చిత్రించడమే కాకుండా,  వారి నిర్ణయాల వెనుక ఉన్న పరిస్థితులను, వ్యక్తిగత సంఘర్షణలను కథలో భాగం చేశారు. దీనివల్ల పాఠకులకు చరిత్రలోని సంఘటనలతోపాటు, వాటిని ప్రభావితం చేసిన పరిస్థితుల గురించి కూడా తెలుసుకునే అవకాశం కలిగింది.  ముదిగొండ వారి రచనల్లో కనిపించే మరో ప్రత్యేకత ఆయన కథనశైలి. చారిత్రక విషయాలను వివరించేటప్పుడు అవసరమైనచోట కల్పనను జోడిస్తూ, కథను మరింత ఉత్కంఠభరితంగా మలిచారు. అయితే చారిత్రక నవలలో కల్పనకు ఉన్న స్థానం, చారిత్రక వాస్తవాలకు ఉన్న ప్రాధాన్యం రెండింటినీ సమన్వయం చేయడం రచయితకు పెద్ద సవాలు. అలాంటి సవాళ్లను సైతం సమర్థంగా ఎదుర్కొంటూ, చరిత్రకు సాహిత్య సౌందర్యాన్ని జోడించి, పాఠకులకు ఆసక్తికరమైన కథనాలను అందించడంలో ముదిగొండ శివప్రసాద్‌‌‌‌‌‌‌‌ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. 

ఆయన నవలలు చదివే క్రమంలో పాఠకులు కథలో లీనమవడమే కాకుండా, ఆయా కాలాల గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని కూడా పెంచుకుంటారు. చారిత్రక నవలలతో పాటు ముదిగొండ శివప్రసాద్‌‌‌‌‌‌‌‌ సాహిత్య విమర్శకుడిగా, పరిశోధకుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. ఆయనకు ఉన్న విస్తృతమైన పఠనం, చారిత్రక అంశాలపై అవగాహన, సాహిత్యంపై లోతైన పరిశీలన ఆయన రచనలకు బలాన్నిచ్చాయి. ఒకవైపు అధ్యయనం, మరోవైపు రచన.. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆయన తెలుగు సాహిత్యానికి తనవంతు విశేష సేవ చేశారు.

సాహిత్య తపస్వికి అక్షర నివాళి రచయిత గొప్పతనం ఆయన రాసిన పుస్తకాల సంఖ్యలో మాత్రమే ఉండదు. ఆ రచనలు పాఠకుల్లో ఎలాంటి ఆలోచనలను రేకెత్తించాయి,  సమాజానికి ఎలాంటి అవగాహనను అందించాయి,  తరువాతి తరాలకు ఎలాంటి సాహిత్య వారసత్వాన్ని మిగిల్చాయి అనే అంశాల్లోనూ ఉంటుంది. ఈ కోణంలో ముదిగొండ శివప్రసాద్‌‌‌‌‌‌‌‌  సాహిత్యాన్ని పరిశీలించినప్పుడు, చరిత్రను కథారూపంలో అందించి పాఠకులకు చేరువ చేయడంలో ఆయన చేసిన కృషి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆయన నవలలు తెలుగు పాఠకులకు చరిత్రను పరిచయం చేయడంతోపాటు, సాహిత్యం ద్వారా గతాన్ని అర్థం చేసుకోవచ్చనే విషయాన్ని గుర్తుచేస్తాయి.  

కాలం మారుతుంది. పాఠకుల అభిరుచులు మారుతాయి. కొత్త రచనా పద్ధతులు వస్తాయి. అయినప్పటికీ చరిత్రను తెలుసుకోవాలనే తపన పాఠకుల్లో ఎప్పటికీ ఉంటుంది. అందుకు చరిత్రను భవిష్యత్ తరాలు అర్థం చేసుకోవాలనే ఆలోచనతో గతాన్ని వర్తమానానికి చేరువ చేస్తూ, చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడంలో సాహిత్యాన్ని ఒక వాహకంగా మలిచిన రచయితగా ముదిగొండ శివప్రసాద్‌‌‌‌‌‌‌‌ని గుర్తుచేసుకోవచ్చు. ఆయన భౌతికంగా మనమధ్య లేకపోయినా, ఆయన రచనల్లోని పాత్రలు, చారిత్రక ఘట్టాలు, ఆలోచనలు  పాఠకులతో  సంభాషిస్తూనే ఉంటాయి. తెలుగు సాహిత్యంలో ఆయన మిగిల్చిన ఈ అక్షర వారసత్వం పాఠకుల హృదయాంతరంగంలో నిరంతరం మెదులుతూనే ఉంటుంది.  అక్షర తపస్వి.. చారిత్రిక నవలా చక్రవర్తి.. ఆచార్య ముదిగొండ శివప్రసాద్‌‌‌‌‌‌‌‌కి ఇవే మా అక్షర నివాళి! 

తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవ

రచయితకు చరిత్రపై ఆసక్తి ఉండటం వేరు.. ఆ చరిత్రలోని మనుషులను, వారి జీవితాలను, ఆనాటి సమాజాన్ని తన కలంతో మళ్లీ సజీవం చేయడం వేరు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తన రచనలతో చెరిపేసి, గతాన్ని పాఠకుల కళ్లముందు నిలిపిన రచయిత ఆచార్య ముదిగొండ శివప్రసాద్‌‌‌‌‌‌‌‌. 1940 డిసెంబరు 23న అప్పటి ప్రకాశం జిల్లా ఆకులల్లూరు గ్రామంలో జన్మించిన ఈయన ఉన్నత విద్యను అభ్యసించి, అధ్యాపక వృత్తిలోకి అడుగుపెట్టారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పూర్తి చేసిన ఆయన, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి పీహెచ్‌‌‌‌‌‌‌‌డీ పట్టా పొందారు. 

1970లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఆచార్యులుగా సేవలందించి, అధ్యక్షులుగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2000లో పదవీ విరమణ చేసినప్పటికీ, ఆయన సాహితీ ప్రస్థానం మాత్రం నిరంతరాయంగా కొనసాగింది. అధ్యాపక వృత్తికి దూరమైనా అధ్యయనమే తన ప్రవృత్తిగా చేసుకొని ముందుకుసాగారు. అలా.. చారిత్రక నవలలు, సాహిత్య విమర్శ, పరిశోధన వ్యాసాల ద్వారా తెలుగు సాహిత్యానికి విశేషమైన సేవలందించారు.  ఆయన రచనా ప్రస్థానాన్ని పరిశీలిస్తే, చరిత్రను సామాన్య పాఠకులకు చేరువ చేయాలనే తపన కనిపిస్తుంది.  

- మ్యాడం అభిలాష్ 
థింక్ ట్యాంక్ మెంబర్, బోలి చేతో ఫౌండేషన్