తెలంగాణలో పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. 2027 మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువు తేదీలను డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ సవరించింది. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 26 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాత్రం నవంబర్ 27లోగా ఆన్లైన్లో ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది.
ఆలస్య రుసుములతో.. ఫీజు చెల్లింపు తేదీలు ఇవే..
విద్యార్థుల సౌకర్యార్థం వివిధ దశల్లో ఆలస్య రుసుములతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది.
నవంబర్ 26 వరకు: ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా
డిసెంబర్ 8 వరకు: రూ.50 ఆలస్య రుసుముతో
డిసెంబర్ 10 నుంచి 21 వరకు: రూ.200 అపరాధ రుసుముతో
డిసెంబర్ 23 నుంచి జనవరి 4 వరకు: రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చు
పరీక్ష ఫీజు ఎంతంటే?
పదో తరగతి పరీక్షల్లో అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 ఫీజుగా నిర్ణయించారు. వొకేషనల్ కోర్సు విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆన్లైన్లోనే ఫీజు చెల్లించాలి
విద్యార్థుల పరీక్ష ఫీజును పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.in ద్వారా స్కూల్ లాగిన్లో మాత్రమే చెల్లించాలి. IFMIS చలాన్లు, బ్యాంక్ చలాన్ల ద్వారా చెల్లింపులను స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు.విద్యార్థులు, తల్లిదండ్రులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా సకాలంలో పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది.
