బుక్ రివ్యూ: సంగీత, సాహిత్య కళానిధి.. కోడూరి లీలావతి దేవి 

బుక్ రివ్యూ: సంగీత, సాహిత్య కళానిధి.. కోడూరి లీలావతి దేవి 

సంగీత, సాహిత్య రంగాలలో సమాన ప్రతిభను చాటుకోవడమే కాకుండా, సామాజిక సేవలోనూ విశేష కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి కోడూరి లీలావతి దేవి.  ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు దేవత శ్రీరామమూర్తి, లక్ష్మీ దేవమ్మ దంపతులకు 1926లో జన్మించిన ఆమె, తండ్రి నుంచి జాతీయోద్యమ స్ఫూర్తిని పొంది క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.

 మహాత్మా గాంధీ స్వాతంత్య్రోద్యమ నిధికి విరాళం అడిగినప్పుడు తన బంగారు గాజులను సైతం సమర్పించిన దేశభక్తురాలు.  రచయిత్రిగా బాలసాహిత్యం, కథలు, వ్యాసాలు, అనువాద రంగాలలో విశేష కృషి చేశారు. ‘బాలవినోదిని’, ‘గృహవిజ్ఞానం’, ‘ప్రగతిపథంలో ప్రమదలు’, ‘రవి కవి’, ‘బాలచంద్రిక’, ‘ఆశాకిరణం’, ‘కుంకుమరేఖ’, ‘ఇంద్రధనుస్సు’ ఆమె ముఖ్య రచనలు. ‘రవి కవి’, ‘ఇంద్రధనుస్సు’ రచనలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి. 

బాలసాహిత్యానికి చేసిన సేవలకు పలుమార్లు పురస్కారాలు అందుకున్నారు. ఆమె రచనలు ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి.  కొన్ని యునెస్కో గ్రంథాలయంలో చోటు సంపాదించాయి.  వీణా విద్వాంసురాలిగా ఆకాశవాణి మద్రాసు, విజయవాడ కేంద్రాల్లో గ్రేడ్-1 కళాకారిణిగా గుర్తింపు పొందింది.  ఏపీ ప్రభుత్వం ‘వీణావిశారద’, ‘కవయిత్రీమణి’ బిరుదులతో సత్కరించింది. సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, బాలల అకాడమీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం తదితర ప్రతిష్ఠాత్మక సంస్థల్లో కీలక పదవులు నిర్వహించారు.

ఆమె జీవితంపై తెలుగు విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ పరిశోధన జరిగింది. వేంగీ చాళుక్యుల చరిత్ర ఆధారంగా రచించిన ‘జయవిపంచి’ ఆమె చివరి చారిత్రక నవల. 1991 ఏప్రిల్ 16న ఆమె కన్నుమూశారు. ఈ మహనీయురాలి శతజయంతి ఉత్సవాలు 2026 నవంబర్ 21న తెలంగాణ ప్రెస్ అకాడమీ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె రాసిన చివరి నవల జయవిపంచి పుస్తకాన్ని అనేకమంది సాహితీ ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరణ జరుపుకోబోతోంది.