దేశంలో ద్రవ్యోల్బణం రూపురేఖలు వేగంగా మారుతున్నాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే.. గ్రామాల్లోని కుటుంబాలపై ఆహార ధరల భారం ఎక్కువగా పడుతోందట. కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం అక్టోబర్ 2026లో గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ధరలు ఏటా 9.09 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో ఈ పెరుగుదల 8.68%గా మాత్రమే నమోదైంది.
గ్రామీణ ప్రాంతాలపైనే అధిక ప్రభావం
గ్రామీణ ప్రాంతాల్లో కేవలం ఆహార ధరలే కాకుండా.. జనరల్ రిటైల్ ద్రవ్యోల్బణం కూడా అక్టోబర్లో 6.63%కి ఎగబాకింది. పట్టణాల్లో ఇది 5.41%గా ఉంది. అంటే ఆహార పదార్థాలతో పాటు నిత్యవసర వస్తువులన్నింటిలోనూ గ్రామీణ ప్రజలే ఎక్కువ ధరలను ఎదుర్కొంటున్నారు. జనవరిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉండేది. ఆ సమయంలో గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండింది. కానీ కాలక్రమేణా ఆ పరిస్థితి మారి.. మార్చి నాటికి గ్రామీణ ప్రాంతాలు పట్టణాలను అధిగమించాయి.
వంటగదిపై కూరగాయల ధరల భారం..
ఈ ధరల పెరుగుదలకు కొన్ని నిర్దిష్ట కూరగాయలే ప్రధాన కారణమవుతున్నాయి. అక్టోబర్ లెక్కల ప్రకారం ఉల్లి ధరలు ఏకంగా 116.22% పెరిగి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అలాగే వెల్లుల్లి ధరలు 60.74%, అల్లం ధరలు 48.32%, నిమ్మకాయల ధరలు 47.30% చొప్పున పెరిగాయి. అయితే కొన్ని కూరగాయల ధరలు తగ్గడం కొంత ఊరటనిచ్చినా.. ప్రధాన వంట దినుసులు భగ్గుమంటుండటంతో ఆ ఉపశమనం ఎవరికీ సరిపోవడం లేదు. ఉదాహరణకు బంగాళాదుంప ధరలు 14.24%, క్యాలీఫ్లవర్ 10.57% మేర తగ్గాయి.
తిండి ఖర్చులకే ఆదాయం..
పట్టణ ప్రజలతో పోలిస్తే గ్రామీణ ప్రజలు తమ సంపాదనలో చాలా ఎక్కువ భాగం తిండికే వెచ్చిస్తున్నారు. 'గృహ వినియోగ వ్యయ సర్వే' (HCES) ప్రకారం.. గ్రామీణ కుటుంబాలు తమ నెలవారీ ఖర్చులలో ఏకంగా 47.04% భాగాన్ని కేవలం ఆహారం కోసమే వెచ్చిస్తున్నాయి. అదే పట్టణాల్లో ఈ ఖర్చు 39.68% మాత్రమే. అంటే ప్రతి 100 రూపాయల ఖర్చులో గ్రామాల్లోని ప్రజలు రూ. 47 ఆహారానికే కేటాయిస్తున్నారు. దీనివల్ల నిత్యవసరాల ధరలు పెరిగితే గ్రామీణ కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోంది. ఇతర అవసరాలకు ఖర్చు చేయడానికి వారి వద్ద డబ్బు మిగలకుండా పోతోంది.
దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం..
ఈ ద్రవ్యోల్బణం జాతీయ స్థాయిలో మాత్రమే కాకుండా, ప్రాంతాల వారీగా చూసినప్పుడు కొన్ని రాష్ట్రాలను మరింత కుదిపేస్తోంది. అక్టోబర్ డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 13.23% ఆహార ద్రవ్యోల్బణం నమోదైంది. తమిళనాడులో 12.37%, కర్ణాటకలో 12.16%, తెలంగాణలో 11.66%.. కేరళలో 10.92% చొప్పున ద్రవ్యోల్బణం రికార్డయింది. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలు ఈ ధరల పోటును తీవ్రంగా ఎదుర్కొంటున్నాయని తెలుస్తోంది.
ALSO READ : అక్టోబర్లో 12.29% చేరిన హోల్సేల్ ద్రవ్యోల్బణం
గ్రామాల్లో ఆహార ద్రవ్యోల్బణం ఇలాగే కొనసాగితే.. అది కేవలం కిరాణా బిల్లులకే పరిమితం కాదు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి, ఆటోమొబైల్స్, బట్టలు, ఇతర గృహోపకరణాల వంటి నాన్-ఎసెన్షియల్ రంగాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రభుత్వాలు ఈ గ్రామీణ-పట్టణ అసమానతలను గుర్తించి, సామాన్యులపై భారం పడకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
