ఆధ్యాత్మికం: జీవితంలో పెద్దశత్రువు ఎవరో తెలుసా.. దానిని దూరంగా ఉంచాలంటే చేయాల్సింది ఇదే..!

ఆధ్యాత్మికం:  జీవితంలో పెద్దశత్రువు ఎవరో తెలుసా.. దానిని దూరంగా ఉంచాలంటే చేయాల్సింది ఇదే..!

'నాకేంటి?'.. జీవితంలో కనిపించకుండా మాయం కావాల్సిన ప్రశ్నల్లో ఇది ఒకటి!లేదంటే ఇది అహంకారం పెరగడానికి కారణం అవుతుంది. అహంకారం వల్లనే చెడు ఆలోచనలు, అహంకారం వల్లనే కోరికలు, ప్రయత్నాలు. కాబట్టి, అహంకారం కంటే పెద్ద శత్రువు వేరొకరు లేరని 'మహోపనిషత్తు' చెప్తోంది. 

వ్యక్తిగత గుర్తింపుపై ఉండే వ్యామోహాన్ని ఎలా తొలగించుకోవాలో తెలిసినప్పుడు.. జీవితప్రయాణం వేరే దిశలో సాగుతుంది. అప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు కారణంగానీ, దాని ప్రభావంగానీ మీ మీద ఉండదు. అంటే అంతులేని కర్మ చక్రం నుంచి విముక్తి పొందుతారు.

ప్రతి ఒక్కరిలో ఉన్న 'నేను' ఒకటే అయినప్పటికీ... తన శరీరం మీద తనకు ఉన్న అభిమానంతో భేదాలు పాటిస్తూ, దేహమే 'నేను' అని భావించడం అహంకారం అవుతుంది. 

రూపాహంకారం... ధనాహంకారం... విద్యాహంకారం.... అధికార అహంకారం...జ్ఞానాహంకారం.. ఇలా రకరకాల అహంకారాలు ఉంటాయి. ఏ అహంకారం అయినా.. ఎదుటి మనిషితో పాటు ఆ మనిషిని కూడా ఎప్పుడూ బాధపెడుతూ ఉంటుంది. ఈ అహంకారాన్ని అణచివేయగలిగితే... శాశ్వత జ్ఞానాన్ని, ఆనందాన్ని పొందొచ్చని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తుంది.మనిషికి ఉండే కోరికలు, ఇష్టాలు, అయిష్టాల వల్ల కలిగే ఈ అహంకారం.. మనుషుల మధ్య విభేదాలు పెంచడానికి, కర్మచక్రంలో ఇరుక్కుపోవడానికి కారణమవుతుంది.

కోరికలు లేకుండా ఉండటం

'కోరికలు లేకుండా జీవించాలి' అని గౌతమబుద్ధుడు నొక్కి చెప్పిన విషయాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. కోరిక లేకుండా మనిషి ఉనికే ఉండదని ఆయనకు కూడా బాగా తెలుసు. కానీ, ఆయన చెప్పిన విషయం ఏంటంటే.. లోపలి సంపూర్ణత్వం గురించే కానీ, లోపల పుట్టే కోరిక గురించి కాదు.

 ఒకసారి మన హృదయం సంపూర్ణత్వాన్ని సాధించిన తర్వాత.. అసలైన ఆనందం ఎలా ఉంటుందో పరిచయం అవుతుంది. అప్పుడు మనలో కలిగే కోరిక గుర్తింపు తాలూకు అహంకారాన్ని రగిలించే ఇంధనం కాబోదు. ఆ కోరిక అన్నింటికంటే ఉన్నతమైనది. అది విశ్వ శ్రేయస్సు కోరుకుంటుంది. ఇలాంటి కోరికే ఆత్మలను మహాత్ములుగా మారుస్తుంది.

మన లక్ష్యం

కోరిక పెద్దదై ఉండాలి. కానీ, ఆ కోరిక వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించినది. కాకూడదు. అలాంటప్పుడు నేచర్ మీరు ఏం చెప్తే.. అదే చేస్తుంది. ఆ తర్వాత నుంచి మీరు దేనిని ఆరాధించాల్సిన అవసరం లేదు. దేవుడి ముందు పడి దేనికోసం ప్రార్థించాల్సిన అవసరం కూడా ఉండదు. దేవుడు ఇకపై మీ యజమాని కాదు. మీ సేవకుడు... ఎందుకంటే. మీరు దైవంతో స్నేహం చేశారు.

ALSO READ : వెలుగు కవిత.. తలపులు విప్పారిన...!

పరిమితులు

కోరికలకు పరిమితులు ఉంటాయా? అని తెలుసుకోవాలంటే.. కోరికతో సంతృప్తి కలిసి ఉందా? లేదా? అని తెలియాలి. కోరికకు సంతృప్తిగా ఉంటే... ఆ కోరిక తెలిసిన వాటి గురించే అయి ఉంటుంది. మనకు డబ్బు, ఫేమ్, ప్రేమ గురించి తెలిసినప్పుడు మన కోరికలు వాటి వరకే ఆగిపోతాయి. ఈ కోరికలు నెరవేరొచ్చు. నెరవేరకపోవచ్చు.

 ఒకవేళ మీ కోరిక ప్రత్యేకంగా ఒక వ్యక్తికో, ప్రయోజనానికో సంబంధించినది కానప్పుడు..అడగకుండానే అన్నీ మీ ముందుకు వచ్చి వాలుతాయి. అంటే, మీ కోరికలు మీకన్నా పెద్దగా ఉన్నప్పుడు.. మీ జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి. ఈ టైంలో మీరు ఊహించని విషయాలు కూడా ఎదురొస్తాయి.. ఎందుకంటే, మీ లైఫ్ ఎనర్జీ ఎంతో ఎత్తున ఉంటుంది. ఇది జరిగిన తర్వాత మీరెన్నో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు.

–జగ్గీ వాసుదేవ్–