Teja Sajja Engagement: తేజ సజ్జా నిశ్చితార్థ వేడుకకు హాజరైన తెలంగాణ గవర్నర్..

Teja Sajja Engagement: తేజ సజ్జా నిశ్చితార్థ వేడుకకు హాజరైన తెలంగాణ గవర్నర్..

హనుమాన్, మిరాయ్ సినిమాలతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో తేజ సజ్జ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇప్పటికే పెళ్లి వార్తలతో అభిమానుల్లో ఆసక్తి రేపిన ఈ హీరో.. తాజాగా తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో జరిగిన నిశ్చితార్థ వేడుకలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సందడి చేశారు. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా తేజ సజ్జ నిశ్చితార్థ వేడుక..

యంగ్ హీరో తేజ సజ్జ నిశ్చితార్థ వేడుక (నవంబర్ 16, 2026) హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తాజ్ కృష్ణ హోటల్‌లో సంప్రదాయబద్ధంగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నట్లు సమాచారం.

తేజ సజ్జ కాబోయే భార్య ఎవరు?

తేజ సజ్జ తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ మీడియా హడావుడికి దూరంగా ఉంచుతుంటారు. అయితే తన వివాహం పెద్దలు కుదిర్చిన సంబంధమని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాబోయే జీవిత భాగస్వామి అమెరికాలో పెరిగారని, ప్రస్తుతం తన తండ్రితో కలిసి టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్నారని తెలిపారు. ఆమె కుటుంబానికి సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని, ఆమె వ్యక్తిగత గోప్యతను గౌరవించాలనే ఉద్దేశంతో పేరును బయటపెట్టడం లేదని తేజ చెప్పుకొచ్చారు.

డిసెంబర్‌లో వివాహం.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!

నిశ్చితార్థం అనంతరం తేజ సజ్జ వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం, 2026 డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ వివాహ వేడుక జరగనుంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ పెళ్లిని నిరాడంబరంగా నిర్వహించాలని తేజ భావిస్తున్నట్లు గతంలో వెల్లడించారు. వివాహం అనంతరం హైదరాబాద్‌లో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా కథనాలు పేర్కొన్నాయి. అయితే పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించలేదు. 

►ALSO READ | రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. ఓ ఇంటివాడు కాబోతున్న పెద్ద కుమారుడు!

సినిమాల పరంగా ఫుల్ బిజీ!

వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్న తేజ సజ్జ.. మరోవైపు సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'హనుమాన్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఆ తర్వాత 'మిరాయ్'తో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం 'మిరాయ్ 2', 'జాంబీ రెడ్డి 2 – నెక్స్ట్ లెవల్' వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా 'జాంబీ రెడ్డి'కి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి.. హీరోగా ఎదిగి.. 'హనుమాన్'తో పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. దీంతో ఆయన నిశ్చితార్థం, రాబోయే వివాహ వేడుకల గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.