దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దోషులుగా తేలి జీవిత ఖైదిగా అనుభవిస్తున్న ఇద్దరికి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలులో గడిపిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. వారి యావజ్జీవ కారాగార శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేసి బెయిల్ మంజూరు చేసింది.
ఇద్దరికి బెయిల్ ఎందుకంటే?
బిల్కిస్ బానో కేసులో దోషులుగా తేలిన ఇద్దరు వ్యక్తులు తమకు విధించిన జీవిత ఖైది శిక్షను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2017లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఇద్దరు దోషులు ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపారని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. వారిలో ఒకరు తీవ్రమైన వైకల్యంతో బాధపడుతున్న విషయాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది. ఈ కేసులో వాస్తవాలు, చట్టపరమైన అంశాలపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో అప్పీళ్లపై తుది నిర్ణయం వెలువడే వరకు వారి జీవిత ఖైది శిక్ష అమలును నిలిపివేసి బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్పై అభ్యంతరం తెలిపిన ప్రభుత్వం
అయితే, దోషులకు బెయిల్ మంజూరు చేయడాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ రాజా ఠాక్రే తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేరం అత్యంత తీవ్రమైనదని, కింది కోర్టులు కూడా ఉన్న సాక్ష్యాధారాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే శిక్ష విధించాయని వాదించారు. అయినప్పటికీ, దోషులు ఇన్నేళ్లుగా జైలులో ఉండటం, వారిలో ఒకరికి తీవ్రమైన వైకల్యం ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
11 మంది విడుదల.. 2024లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఈ ఇద్దరు వ్యక్తులు 2022 ఆగస్టులో గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేసిన 11 మంది దోషుల్లో ఉన్నారు. అప్పట్లో గుజరాత్ ప్రభుత్వం 1992 నాటి శిక్షా తగ్గింపు విధానాన్ని ఆధారంగా చేసుకుని వారికి మినహాయింపు ఇచ్చింది. దీంతో 2022 ఆగస్టు 15న స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా మొత్తం 11 మంది దోషులు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నిర్ణయంపై బిల్కిస్ బానోతో పాటు పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2024 జనవరిలో కీలక తీర్పు వెలువరించింది. దోషుల విడుదలకు గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది. శిక్షా తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని, ఈ విషయంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులు కీలక వాస్తవాలను దాచిపెట్టి, కోర్టును తప్పుదోవ పట్టించడం ద్వారా పొందినవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో విడుదలైన 11 మంది దోషులు తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
ALSO READ : బతికుండగానే 13వ రోజు దినం వేడుక నిర్వహించిన వ్యక్తి
అసలు బిల్కిస్ బానో కేసు ఏంటి?
2002లో గుజరాత్లో జరిగిన మత ఘర్షణల సమయంలో బిల్కిస్ బానో కుటుంబం తీవ్ర విషాదాన్ని ఎదుర్కొంది. అప్పటికి ఆమె వయసు 21 ఏళ్లు. ఐదు నెలల గర్భిణిగా ఉన్న ఆమెపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. మృతుల్లో బిల్కిస్ బానోకు చెందిన మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కేసు విచారణలో భాగంగా నిందితులకు శిక్షలు విధించగా, ఆ తర్వాత వారికి ముందస్తు విడుదల కల్పించడం మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఇప్పుడు ఏం జరగనుంది?
ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు చేయడంతో పాటు, వారి జీవిత ఖైది శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. దీని అర్థం వారు కేసులో నిర్దోషులుగా విడుదలైనట్లు కాదు. వారికీ విధించిన శిక్షను సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీళ్లపై తుది నిర్ణయం రావాల్సి ఉంది. మరోవైపు, ఈ కేసులో న్యాయం కోసం బిల్కిస్ బానో చేసిన పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది. తాజాగా ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు కావడంతో ఈ కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది.
