శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో సీఆర్పీఎఫ్ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. సోమవారం (నవంబర్ 16) కుల్గాంలో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో వాంటెడ్ లష్కర్-ఎ-తైబా (LeT) టెర్రిరిస్ట్ లతీఫ్ భట్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాశ్మీర్ జోన్ పోలీసులు ఈ ఎన్ కౌంటర్‌ను ధృవీకరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘కుల్గాంలో ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. మొత్తం ప్రాంతాన్ని దిగ్బంధించారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని తెలిపారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని మిగిలిన ఉగ్రవాదుల కోసం గాలింపును ముమ్మరం చేశాయి.
2026, నవంబర్ 11న కుల్గాంలో భారీగా ఆయుధాలు ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ పోస్టుపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. దాడి అనంతరం ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోయారు. పస్దారన్-ఎ-హురియత్ కాశ్మీర్ అనే కొత్త సంస్థ బాధ్యత ఈ దాడికి బాధ్యత వహించింది.
సీఆర్పీఎఫ్ పోస్టుపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు కుల్గాంలోనే ఉన్నారన్న ఇంటలిజెన్స్ సమాచారం మేరకు భద్రతా దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి ఉగ్రమూకల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సైనికాధికారులు, డీజీపీ నలిన్ ప్రభాత్, కాశ్మీర్ రేంజ్ ఐజీపీ సుజిత్ కుమార్ సింగ్ ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు.
ఈ క్రమంలోనే సోమవారం (నవంబర్ 16) కుల్లాంలో కూంబింగ్ నిర్వహిస్తోన్న భద్రతా దళాలకు ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
►ALSO READ | జిమ్‌లో త్రెడ్‌మిల్ చేస్తూ మూడో అంతస్తు నుంచి పడి 22 ఏళ్ల యువతి మృతి
మృతులను లతీఫ్ భట్ అనే లష్కరే ఉగ్రవాదితో పాటు అతడి అనుచరుడు ఉమర్గా అధికారులు గుర్తించారు. నవంబర్ 11న మిర్ బజార్‌లోని సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై జరిగిన దాడితో వీరికి సంబంధం ఉన్నట్లు నిర్ధారించారు. 22 ఏళ్ల లతీఫ్ భట్ జమ్మూ కాశ్మీర్ పోలీసుల రికార్డులలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. ఇతడు జూలై 2026లో అనంతనాగ్‌లో ఒక పోలీసు కానిస్టేబుల్ హత్య, కుల్గాంలో వలస కార్మికుల హత్య కేసుల్లో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి.
