జిమ్‌లో త్రెడ్‌మిల్ చేస్తూ మూడో అంతస్తు నుంచి పడి 22 ఏళ్ల యువతి మృతి

జిమ్‌లో త్రెడ్‌మిల్ చేస్తూ మూడో అంతస్తు నుంచి పడి 22 ఏళ్ల యువతి మృతి

బాడీ ఫిట్‌నెస్, ఆరోగ్యం కోసం చాలా మంది జిమ్‌లకు వెళ్తుంటారు. కానీ కొన్నిసార్లు చిన్న నిర్లక్ష్యం ప్రాణాల మీదికి తెస్తుంది. అవును ఇండోనేషియాలో జరిగిన ఒక హృదయ విదారక ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. త్రెడ్‌మిల్‌పై నడుస్తున్న ఓ యువతికి.. అదే ప్రాణాంతకం అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేస్తోంది. 

ఇండోనేషియాలోని వెస్ట్ కాలిమంటన్, పొంటియానక్ ప్రాంతంలోని ఫిట్‌నెస్ సెంటర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. 22 సంవత్సరాల ఆ యువతి జిమ్‌లో సుమారు 30 నిమిషాల పాటు వ్యాయామం చేసింది. ఆ తర్వాత అలసట తీర్చుకోవడానికి కాస్త ఆగి, టవల్‌తో ముఖాన్ని తుడుచుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆ సమయంలో ఆమె ప్రమాదవశాత్తు వెనక్కి తూలింది. అప్పటికే ఆన్ చేయబడి వేగంగా తిరుగుతున్న త్రెడ్‌మిల్ నుంచి అదుపుతప్పి.. సరిగ్గా దాని వెనుక వైపు తెరిచి ఉన్న కిటికీలో నుంచి కిందపడిపోయింది.

ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కిటికీలో నుంచి పడిపోతున్న సమయంలో ఆ యువతి ఫ్రేమ్‌ను పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. 3వ అంతస్తు నుంచి కిందికి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. ప్రాణాలను కాపాడలేకపోయినట్లు వైద్యులు తెలిపారు. కిటికీకి అతిసమీపంలో త్రెడ్‌మిల్‌ను ఏర్పాటు చేయడం అతిపెద్ద సేఫ్టీ లోపమని అధికారుల దర్యాప్తులో తేలింది.

►ALSO READ | ముంబైలో వేల్స్ యువరాజు.. ఎర్త్‌షాట్ ప్రైజ్ కోసం భారత్కు వచ్చిన ప్రిన్స్ విలియం, కేట్

ఈ మరణం జిమ్‌లలో ఉండే భద్రతా ప్రమాణాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. బాధ్యులైన జిమ్‌ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆ ఫిట్‌నెస్ సెంటర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. భవనాల్లో జిమ్ పరికరాలను అమర్చేటప్పుడు కిటికీలు, బాల్కనీల దగ్గర తగినంత రక్షణ ఏర్పాట్లు, గ్రిల్స్ ఉండేలా చూసుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన కళ్లకు కట్టింది. చిన్నపాటి అజాగ్రత్త ఒక యువతి ప్రాణాలను బలిగొంది.