ఏపీ ఎన్నికలు: రెండో విడత పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల...

ఏపీ ఎన్నికలు: రెండో విడత పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల...

ఏపీలో రెండో విడత గ్రామ పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. నవంబర్ 29న రెండో విడత పంచాయితీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా. ఈ నోటిఫికేషన్ రాష్ట్రంలో27 జిల్లాల్లో ఎంపిక చేసిన మండలాలకు వర్తిస్తుందని తెలిపారు. 

జిల్లాల వారీగా.. మండలాల వారీగా ఎన్నికలు జరిగే ప్రాంతాల వివరాలను నోటిఫికేషన్‌కు అనుబంధంగా జత చేసినట్లు కమిషన్ వెల్లడించింది.

రెండో విడత పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ఇదే..

ఎన్నికల ప్రక్రియ నవంబర్ 18న ప్రారంభం కానుంది.. నోటీసు వెలువడిన వెంటనే అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. నామినేషన్ల స్వీకరణ ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి నవంబర్ 20ని చివరి తేదీగా నిర్ణయించారు. 

నవంబర్ 21న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ చేపడతారు. ఒకవేళ ఏదైనా నామినేషన్ తిరస్కరణకు గురైతే, సంబంధిత అభ్యర్థులు నవంబర్ 22న అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. అప్పీలేట్ అధికారులు ఈ ఫిర్యాదులను నవంబర్ 23వ తేదీ లోపు పరిష్కరిస్తామని తెలిపింది ఎన్నికల సంఘం.

పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు నవంబర్ 24వ తేదీలోగా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని... ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనుంది ఎన్నికల సంఘం.

పోలింగ్, కౌంటింగ్ ఒకే రోజు..

నవంబర్ 29న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. సర్పంచ్ ఎన్నిక ఫలితాలు వెలువడిన తర్వాత, అదే రోజున ఉప సర్పంచ్ ఎన్నికను కూడా నిర్వహిస్తారు.

ఒకవేళ ఏదైనా పోలింగ్ కేంద్రంలో అవాంఛనీయ సంఘటనలు జరిగి రీ-పోలింగ్ అవసరమైతే, దానిని నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.

నిబంధనలు..మినహాయింపులు:

కోర్టు ఆదేశాల వల్ల ఎన్నికల నిర్వహణపై స్టే ఉన్న గ్రామ పంచాయతీల్లో లేదా ఇతర పరిపాలనాపరమైన, న్యాయపరమైన అడ్డంకులు ఉన్న చోట ఎన్నికల నోటీసులు జారీ చేయవద్దని జిల్లా కలెక్టర్లను, జిల్లా ఎన్నికల అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. 

కాగా, నవంబర్ 13న మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. మొదటి దశకు సంబంధించి నవంబర్ 15 నుంచి 17 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించిన సంగతి విదితమే. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. సంబంధిత మండలాల్లో రాజకీయ సందడి మొదలైంది.