ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలను మింగేస్తుందని ఆందోళన పెరుగుతున్న సమయంలో.. కాగ్నిజెంట్ మాత్రం ఈ ఏడాది 24వేల నుంచి 25వేల మంది ఫ్రెషర్లను హైర్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇది గత ఏడాది తీసుకున్న దాదాపు 20వేల మంది కంటే 20 శాతం ఎక్కువ. AI వల్ల ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు పూర్తిగా పోవడం లేదని, కేవలం వాటి స్వరూపం మారుతోందని కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ వారియర్ స్పష్టం చేశారు. AI రొటీన్ పనులను ఆటోమేట్ చేస్తోందని, దీనికి అర్థం ఉద్యోగాలు మాయమవడం కాదని, రోల్స్ ట్రాన్స్ఫార్మేషన్ అని చెప్పారు.
కాగ్నిజెంట్-పియర్సన్ జూన్ 2026 స్టడీ ప్రకారం, భారతీయ సంస్థల్లో ఎంట్రీ-లెవల్ జాబ్స్ ఏకంగా 37 శాతం AI ద్వారానే జరుగుతున్నాయని తేలింది. ఇది 33 శాతంగా ఉన్న గ్లోబల్ యావరేజ్ కంటే ఎక్కువ. అదే సమయంలో సర్వేలో పాల్గొన్న వారిలో 80 శాతం మంది ఏఐ వల్ల తమ సిబ్బంది హయ్యర్-వ్యాల్యూ పనిపై దృష్టి పెట్టగలుగుతున్నారని చెప్పారు. ఇంకా ఆ స్టడీలో పాల్గొన్న HR లీడర్లలో 94 శాతం మంది ఏఐ వల్ల ప్రస్తుతం లేని కొత్త ఎంట్రీ-లెవల్ రోల్స్ రాబోతున్నట్లు అభిప్రాయపడ్డారు.
అయితే ఇండస్ట్రీ-వైడ్ ట్రెండ్ చూస్తే పరిస్థితి అంత ఆశావహంగా లేదు. నాస్కామ్ అంచనాల ప్రకారం FY26లో ఇండియా టెక్ సెక్టార్ లక్షా 35వేల మందిని అదనంగా చేర్చుకుంది. అయినప్పటికీ క్యాంపస్ హైరింగ్ మాత్రం భారీగా తగ్గింది. నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేష్ నాంబియర్ నిక్కేయి ఆసియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరింత స్పష్టంగా చెప్పారు. ఫ్రెషర్ల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఇది నిజంగా ఒక సమస్య అన్నారు.
►ALSO READ | గ్రామాల్లో భారీగా పెరిగిన తిండి ఖర్చులు : సిటీల్లోనే నయం అంటున్న రిపోర్టులు
ఇప్పుడు ఎంట్రీ-లెవల్ ఉద్యోగి కేవలం పనులు చేయడం మాని, AI అవుట్‌పుట్‌లను వెరిఫై చేయడం, రిజల్ట్‌లను ఇంటర్ప్రెట్ చేయడం, ఎక్సెప్షన్స్ మేనేజ్ చేయడం వంటి పనులు చేయాల్సి వస్తుందని తెలిపారు రాజేష్ వారియర్. AI ఇన్సైట్స్ ఇంటర్ప్రెట్ చేయడం, బిజినెస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, హ్యూమన్ జడ్జ్మెంట్ అవసరమయ్యే సందర్భాలు గుర్తించడం ఇవే ముందు ముందు కీలకమవుతాయని పేర్కొన్నారు.
కాలేజీలు, ఫ్రెషర్లు ఏం చేయాలని అడిగితే వారియర్ 3 విషయాలు చెప్పారు. AI స్కిల్స్ నేర్చుకోవడం, క్రిటికల్ థింకింగ్ పెంచుకోవడం, కమ్యూనికేషన్ కొలాబరేషన్ అభివృద్ధి చేసుకోవడం. యూనివర్సిటీలు కోర్సులను ఇండస్ట్రీతో కలిసి అప్డేట్ చేయాలని, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్-బేస్డ్ లెర్నింగ్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని కూడా సూచించారు. మెుత్తానికి కాగ్నిజెంట్ ప్రస్తుతం తన ఉద్యోగులను AI రెడీగా తీర్చిదిద్దే పనిలో ఉంది. 46వేల మంది ఉద్యోగులు ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐ, గూగుల్ జెమిని, గిట్ హబ్ కోపైలట్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో కనీసం ఒక సర్టిఫికేషన్ పూర్తి చేశారు. 74వేల మంది ట్రైనింగ్‌లో ఉన్నారు. కంపెనీ 5వేల మంది ఫ్రాంటియర్ సర్టిఫైడ్ ఇంజినీర్లు, 10వేల మంది ఫ్రాంటియర్ బిజినెస్ ఆపరేటర్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి 20 లక్షల మందిని అప్‌స్కిల్ చేయాలని సైనాప్స్ ఇనిషియేటివ్ కింద ప్లాన్ చేసింది.
