16 రోజుల్లో 7 హత్యలు : జర్నలిస్టుల పర్యటన అంటూ బ్యానర్ తో తిరిగిన హంతకుడు..

16 రోజుల్లో 7 హత్యలు : జర్నలిస్టుల పర్యటన అంటూ బ్యానర్ తో తిరిగిన హంతకుడు..

హత్యలు చేయడమే కాదు.. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఏకంగా జర్నలిస్టు అవతారమే ఎత్తాడు. కారు వెనుక 'ప్రెస్' స్టిక్కర్, 'జర్నలిస్టుల ట్రిప్' అంటూ ఓ బ్యానర్ పెట్టి  నగరాలు, పట్టణాలు చుట్టేశాడు. దీంతో అతడి కారును చూసినవారికి అందులో మీడియా ప్రతినిధులు ఉన్నారని... ఎక్కువగా అనుమానం వచ్చేది కాదు. కానీ ఆ కారులో ఉన్నది జర్నలిస్టులు కాదు.. హత్యలకు పాల్పడిన ఓ కిరాతకుడు.. ఇలా ఒక్కటి కాదు.. ఏకంగా 16 రోజుల్లో ఏడుగురిని హత్య చేసాడు. ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించింది.

భార్యతో మొదలైన హత్యలు 
బెంగళూరుకు చెందిన క్యాబ్ డ్రైవర్ ఇందు శేఖర్ ఈ కేసులో ప్రధాన నిందితుడు. పోలీసుల వివరాల ప్రకారం.. మొదట తన భార్యను హత్య చేసిన  ఆమె మృతదేహాన్ని నంది హిల్స్ ప్రాంతంలో పడేశాడు. అంతటితో ఆగకుండా తన బావమరుదులను మద్యం విందు పేరుతో  పిలిచి వారిని కూడా హత్య చేసాడు. ఆ తర్వాత మరో నలుగురు బంధువులను సైతం హతమార్చి, వారి మృతదేహాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసులు తేల్చారు. ఇలా అక్టోబర్ 16 నుంచి 31 మధ్య కేవలం 16 రోజుల్లోనే ఏడుగురి ప్రాణాలు తీసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

 మృతదేహాల తరలింపుకు కొత్త వేషం 
సాధారణంగా పోలీసుల చెకింగ్ ఎదురైనప్పుడు ఎవరైనా టెన్షన్  పడతారు. కానీ ఇందు శేఖర్ మాత్రం తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఓ విచిత్రమైన ప్లాన్  వేసినట్లు పోలీసులు గుర్తించారు.

దసరా, దీపావళి పండుగ సెలవుల సమయంలో జర్నలిస్టులు పర్యటనలకు వెళ్తున్నట్లుగా తన కారును రెడీ చేసుకున్నాడు. టయోటా ఎటియోస్ కారుకు వెనుక అద్దంపై ఎరుపు, తెలుపు రంగుల్లో 'ప్రెస్' స్టిక్కర్ అతికించాడు. అంతేకాదు, కారు వెనుక భాగంలో 'జర్నలిస్టుల ట్రిప్' అని రాసి ఉన్న రంగురంగుల బ్యానర్ కూడా ఏర్పాటు చేశాడు. దీంతో రోడ్డుపై వెళ్లేవారికి ఆ కారు మీడియా ప్రతినిధులదేనని అనిపించేది. పోలీసులు కూడా అనవసరంగా ఆపి ప్రశ్నించలేరనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాటు చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

నంబర్ ప్లేట్ కనిపించకుండా బ్యానర్  
ఈ కేసులో పోలీసులకు మరింత అనుమానం కలిగించిన మరో విషయం కూడా ఉంది. కారు వెనుక ఏర్పాటు చేసిన బ్యానర్ నంబర్ ప్లేట్ కనిపించకుండా అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాలను తరలించే సమయంలో వాహనాన్ని ఎవరూ సరిగ్గా గుర్తించకుండా ఉండేందుకే ఇలా చేసి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

శేఖర్ యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహించేవాడని.. అతను జర్నలిస్టునని చెప్పుకోవడానికి విజిటింగ్ కార్డులు, ఐడెంటిటీ కార్డులు కూడా రెడీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా మీడియా ప్రతినిధి ముసుగులో తిరిగితే ఎవరూ తనను అనుమానించరని అతడు భావించినట్లు దర్యాప్తులో బయటపడింది. 

సకలేశ్‌పూర్ నుంచి మంగళూరు వరకు 
శేఖర్ కేవలం బెంగళూరు పరిసరాల్లోనే కాకుండా సకలేశ్‌పూర్, మంగళూరు ప్రాంతాల్లో కూడా ఇదే తరహా బ్యానర్‌తో ప్రయాణించాడు. అంటే మృతదేహాలను వేర్వేరు ప్రాంతాలకు తరలించే సమయంలో ఈ పద్ధతిని ఉపయోగించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను ఒకేసారి కాకుండా వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు... ఈ మొత్తం వ్యవహారంలో అతడికి ఎవరైనా సహకరించారా? హత్యల వెనుక అసలు కారణాలేంటి? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

'ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను'..
ఈ కేసులో పోలీసులను ఆశ్చర్యపరిచిన మరో విషయం శేఖర్ చెప్పిన మాటలు. తన కుటుంబంలోని ఏడుగురిని హత్య చేసిన తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానని అతడు పోలీసులతో చెప్పినట్లు అధికారులు వెల్లడించారు.

ALSO READ : ఈ రాక్షస ఆనందం ఏంట్రా

తన భార్య తనను తరచూ అవమానించేదని, తీవ్రంగా వేధించేదని.. అందుకే ఈ హత్యలకు పాల్పడినట్లు అతడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. 'ఇప్పుడు నేను ప్రశాంతంగా, సంతృప్తిగా ఉన్నాను' అని కూడా అన్నట్లు తెలిపారు. అయితే, ఇవన్నీ నిందితుడు చెప్పిన కారణాలేనని, హత్యలకు సంబంధించిన అసలు ఉద్దేశ్యాన్ని తెలుసుకునేందుకు పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసు విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. శేఖర్ కుమార్తెపైనా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన తల్లి ఆస్తిలో వాటా పొందే విషయంలో తండ్రికి సహకరించినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్యల వెనుక కుటుంబ కలహాలే కారణమా? ఆస్తి వివాదాలే అసలు సమస్యనా? లేక మరేదైనా కారణం ఉందా? అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం శేఖర్‌తో పాటు ఈ కేసులో ఇతర నిందితులను కూడా పోలీసు కస్టడీలో విచారిస్తున్నారు. 16 రోజుల్లో ఏడుగురి హత్యలు, మృతదేహాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేయడం, జర్నలిస్టుల పర్యటన పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసుకుని తిరగడం.. ఇలా ఈ కేసులో ఒక్కో విషయం బయటపడుతున్న కొద్దీ దర్యాప్తు మరింత ఆసక్తికరంగా మారుతోంది.