జేఎన్‌టీయూలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

జేఎన్‌టీయూలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్: కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జేఎన్‌టీయూలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్‌ భవనంపై నుంచి దూకి రాజు విక్రమ్‌బాబు (19) అనే స్టూడెంట్ సోమవారం (నవంబర్ 16) సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు గౌతమి హాస్టల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారని తల్లిదండ్రులు ఆరోపించారు. 

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. విక్రమ్ మృతిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో క్యాంపస్‎లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వర్శిటీ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి నచ్చజెప్పారు. 

విక్రమ్ మృతిపై విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు హామీతో మృతుడి తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విక్రమ్ మృతికి గల కారణాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు.