మేనిఫెస్టోలో లేకున్నా సన్న బియ్యం ఇస్తున్నం.. ప్రజా సంక్షేమమే మా లక్ష్యం: మంత్రి వివేక్

మేనిఫెస్టోలో లేకున్నా సన్న బియ్యం ఇస్తున్నం.. ప్రజా సంక్షేమమే మా లక్ష్యం: మంత్రి వివేక్

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్ల పాలనలో సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లిందని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. గత ప్రభుత్వం వదిలివెళ్లిన అప్పులకు ఏటా సుమారు రూ.80 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. అంతేకాకుండా రూ.46 వేల కోట్ల కాంట్రాక్టర్ల బిల్లులు, రూ.16 వేల కోట్ల ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల బకాయిలను తమ ప్రభుత్వంపై పెట్టి వెళ్లారని అన్నారు.

సోమవారం (నవంబర్ 16) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మహతి ఆడిటోరియంలో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్, ఒంటరి మహిళలకు చేయూత పెన్షన్ సర్టిఫికెట్, మహిళలకు కుట్టు మిషన్‎లను మంత్రి వివేక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తోందని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాటు రేషన్ కార్డులు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిందని చెప్పారు. ఒకే రోజున రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల పెన్షన్లు అందించినట్లు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సొంతింటి కల కోసం పేదలు ఎదురుచూశారని, గత ప్రభుత్వం వారి ఆశలను నెరవేర్చలేదని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందని తెలిపారు. ఈ దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు తాను పటాన్‌చెరులో పర్యటించానని, అక్కడ ఆసుపత్రిలో ఆయాగా పనిచేసే ఓ మహిళ ఇంటికి వెళ్లినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసిందని మంత్రి వివరించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం రూ.12 వేల కోట్లను కేటాయించిందని వెల్లడించారు. గజ్వేల్ ప్రాంతంలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం కోసం రూ.200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. త్వరలోనే పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు పాఠశాలల్లో అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు.

సన్న బియ్యం పంపిణీని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనకపోయినా పేదలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీగా అప్పులు తీసుకొచ్చి, వాటిపై వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఎల్‌నినో వంటి ప్రకృతి పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నట్లుగా విమర్శలు చేస్తున్నారని, మరి కరోనా మహమ్మారిని బీఆర్‌ఎస్‌ సృష్టించిందా అని ప్రశ్నించారు. ప్రకృతి విపత్తులు, సంక్షోభాలను ఎదుర్కొనేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమై పనిచేయాలని పిలుపునిచ్చారు.

ALSO READ : తిరుమలలో పుష్పాలు ఊరేగింపు.. ఉద్యానవనంలో ప్రత్యేక పూజలు..!

రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు నిధుల సమీకరణ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారని మంత్రి తెలిపారు. తెలంగాణ అభ్యున్నతికి అవసరమైన నిధులు కేటాయించాలని కోరినట్లు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.