న్యూఢిల్లీ: దేశీయ ప్రముఖ వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ గ్రూపులో ఆస్తుల పంపకం రచ్చకెక్కింది. టీవీఎస్ గ్రూపులో తన వాటా కోసం టీవీఎస్ మోటార్ కంపెనీ చైర్మన్ ఎమెరిటస్ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మీ వేణు న్యాయ పోరాటానికి దిగారు. ఈ మేరకు ఉమ్మడి కుటుంబ ఆస్తులను చట్టబద్ధంగా విభజించి, తనకు రావాల్సిన సమాన వాటాను ఇవ్వాలని కోరుతూ లక్ష్మీ తన తండ్రి వేణు శ్రీనివాసన్‌కు లీగల్ నోటీసు పంపారు. కుటుంబపెద్దగా తండ్రి వేణు శ్రీనివాసన్ తన బాధ్యతలను నెరవేర్చి ఆస్తులను న్యాయబద్ధంగా చట్టప్రకారం విభజించేలా చూడాలని నోటీసులో లక్ష్మీ కోరారు.
వీఎస్ ట్రస్ట్ ద్వారా ఉన్న కుటుంబ ఆస్తులతో పాటు 2020 నాటి టీవీఎస్ కుటుంబ ఒప్పందం ప్రకారం వేణు శ్రీనివాసన్ కుటుంబానికి కేటాయించబడిన వ్యాపార వాటాలలో విభజన చేయాలని ఆమె నోటీసులో డిమాండ్ చేశారు. ఇందులో ప్రధానంగా టీవీఎస్ హోల్డింగ్స్, టీవీఎస్ మోటార్ కంపెనీ, టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్, సుందరం-క్లేటన్ సంస్థల వాటాలు ఉన్నాయి
2005లో సవరించబడిన హిందూ వారసత్వ చట్టం, 1956 (సెక్షన్ 6) ప్రకారం ఉమ్మడి కుటుంబ ఆస్తుల్లో కుమార్తెలకు కూడా కుమారులతో సమానమైన హక్కు ఉంటుందని లక్ష్మీ వేణు పేర్కొన్నారు. కుటుంబ పెద్దగా తన బాధ్యతలను నెరవేర్చి ఆస్తులను న్యాయబద్ధంగా విభజించాలని ఆమె తన తండ్రిని విజ్ఞప్తి చేశారు.
2020లో పెద్ద టీవీఎస్ కుటుంబంలోని నాలుగు శాఖల మధ్య వ్యాపారాల విభజన జరిగింది. ఆ తర్వాత 2024 మార్చిలో వేణు శ్రీనివాసన్ కుటుంబ సభ్యుల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. అయితే, అది కేవలం బ్రాండ్ వినియోగం, వ్యాపార నిర్వహణకు సంబంధించినదే తప్ప ఆర్థిక ఆస్తుల విభజన కాదని లక్ష్మి వాదించారు. వేణు శ్రీనివాసన్ కుటుంబంలో ఆస్తుల పరిష్కారం లేదా విభజన ఎప్పుడూ ప్రారంభం కాలేదు, ఎప్పుడూ పూర్తి కాలేదని పేర్కొన్నారు.
►ALSO READ | 3 నెలల్లో క్రెడిట్ కార్డుల ద్వారా రూ.200 కోట్లు సంపాదించాలి: టార్గెట్ ఫిక్స్ చేసుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్
కుటుంబ వ్యాపారాలను నిర్వహించడంవల్ల ఒక వ్యక్తికి సొంతంగా ప్రత్యేక యాజమాన్య హక్కులు లభించవని, అదే సమయంలో ఇతర కుటుంబసభ్యుల చట్టపరమైన హక్కులు తొలగిపోవని వాదించారు. కుటుంబ ఆస్తులలో ప్రధాన వాటాను తన హక్కులను ఫణంగా పెట్టి తన సోదరుడు సుదర్శన్‌కు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ చర్యలను ఆమె చట్టపరమైన, నమ్మకద్రోహ సమస్యగా లక్ష్మీ అభివర్ణించారు.
ఏకపక్ష నిర్ణయాలు, కార్పొరేట్ ఒప్పందాల ద్వారా కుమార్తెల హక్కులను కాలరాయలేరని పేర్కొన్నారు. లీగల్ నోటీస్ పంపినప్పటికీ సామరస్యపూర్వక పరిష్కారానికే తాను మొగ్గు చూపుతున్నట్లు లక్ష్మీ పేర్కొన్నారు. టీవీఎస్ గ్రూప్ ఆస్తుల పంపకం వివాదంలో వేణు శ్రీనివాసన్ భార్య మల్లికా శ్రీనివాసన్ కుమార్తె వైపు నిలబడ్డారు. తన దృష్టిలో కుమారుడు, కుమార్తె ఇద్దరూ సమానమేనని పేర్కొన్నారు. కుమార్తె లక్ష్మికి ఆస్తుల్లో న్యాయమైన వాటా దక్కాలని ఆమె స్పష్టం చేశారు.
