దక్షిణాది సినీ ఇండస్ట్రీలో వరుస పెళ్లిళ్లతో సందడి వాతావరణం నెలకొంది. సెలబ్రిటీలు ఒక్కొక్కరు తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెబుతూ.. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. తెలుగు, తమిళ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ మిర్నాళిని రవి ఓ ఇంటివారయ్యారు. తన ప్రియుడు మహావిష్ణుతో కలిసి ఏడడుగులు నడిచి వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. సముద్రపు అందాల నడుమ జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ ఏడాది ఆగస్టులో తన ప్రియుడు మహావిష్ణుతో నిశ్చితార్థం చేసుకున్న మిర్నాళిని.. ఆదివారం (నవంబర్ 15) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మలేషియాకు సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం లంగ్కావి ఐలాండ్‌లో ఈ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. పెళ్లి వేడుకలో సంప్రదాయ దుస్తుల్లో వధూవరులు ఎంతో అందంగా మెరిసిపోయారు. ఈ ప్రత్యేక క్షణాలకు సంబంధించిన ఫొటోలను మిర్నాళిని స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
►ALSO READ | Teja Sajja-Mourya engagement: ఘనంగా హీరో తేజ సజ్జా నిశ్చితార్థం... కాబోయే భార్య మౌర్య బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
ఇంతకీ మిర్నాళిని మనసు గెలుచుకున్న మహావిష్ణు ఎవరు? అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఆయన మలేషియాకు చెందిన వ్యక్తి కాగా, ఆధ్యాత్మిక గురువుగా గుర్తింపు పొందినట్లు సమాచారం. వీరిద్దరి పరిచయం, ప్రేమ ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం మిర్నాళిని వెల్లడించలేదు.
ఇక మిర్నాళిని సినీ ప్రయాణం విషయానికొస్తే.. పుదుచ్చేరికి చెందిన ఆమె సోషల్ మీడియాలో క్రియేటివ్ వీడియోలతో మొదట గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 2019లో విజయ్ సేతుపతి నటించిన 'సూపర్ డీలక్స్' చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. అదే ఏడాది వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'గద్దలకొండ గణేశ్'తో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు','మామా మశ్చీంద్ర' వంటి చిత్రాలతో అలరించారు. చివరిగా 'రోమియో' సినిమాలో కనిపించారు. మొత్తానికి వెండితెరపై తన అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు నిజ జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు...
