కార్తీకమాసం: నవంబర్17న గో పూజ..33 కోట్ల దేవతల ఆశీస్సులు.. ఏం చేయాలంటే..!

కార్తీకమాసం: నవంబర్17న గో పూజ..33 కోట్ల దేవతల ఆశీస్సులు.. ఏం చేయాలంటే..!

ఈ ఏడాది( 2026) కార్తీకమాసం కొనసాగుతుంది.  రేపు ( నవంబర్​ 17) కార్తీకమాసం శుక్లపక్షం అష్టమి తిథిరోజున గోపూజ చేయాలని పండితులు చెబుతున్నారు.  ఈ ఒక్కరోజు గోపూజ చేయడం  వలన 33 కోట్ల దేవతల ఆశీస్సులు లభిస్తాయని స్కంద పురాణం ద్వారా తెలుస్తుంది.  రేపు ( నవంబర్​ 17) గోపూజ ఎలా చేయాలి.. ఎందుకు చేయాలి.. ఈ విషయం గురించి ఆధ్యాత్మిక వేత్తలు ఏం చెబుతున్నారు.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం...!

హిందూ పురాణాల ప్రకారం గోవులో 33 కోటి దేవతలు కొలువై ఉంటారు. గోవు ముఖంలో వేదాలు, కొమ్ములలో శివుడు-.. విష్ణువు .  పాదాల్లో పితృదేవతలు ఉంటారని స్కాంద పురాణం చెబుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు గవాం మధ్యే వసామ్యహం అంటే నేను గోవుల మధ్యే ఉంటానని చెప్పాడు.

అందుకే గోపాష్టమి నాడు ఒక్క గోవును పూజిస్తే 33 కోట్ల దేవతలను పూజించినంత ఫలం వస్తుందని, జన్మజన్మల పాపాలు తొలగి, ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. గోపాష్టమి  ప్రతి ఏటా కార్తీక మాస శుక్ల పక్ష అష్టమి నాడు వస్తుంది. ఈ ఏడాది 2026 నవంబర్ 17, మంగళవారం రోజున గోపాష్టమి జరుపుకోనున్నారు.

  • గోపాష్టమి తిథి ప్రారంభం: నవంబర్ 17 తెల్లవారుజామున 4:20 గంటలకు 
  • గోపాష్టమి తిథి ముగింపు :  నవంబర్ 18 ఉదయం 6:06 గంటలకు 
  • ఉదయ తిథి ప్రకారం 17వ తేదీనే గోపాష్టమి పండుగను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. 

పాడి పంటల లక్ష్మి... ముక్కోటి దేవతల నిలయం... మన అమృత మూర్తి గోమాత అని పండితులు చెబుతున్నారు. హిందూ సంస్కృతిలో గోవు  జంతువు కాదు, మన ప్రతి ఇంట అడుగుపెట్టే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి.  అందుకే కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసే సమయంలో ముందుగా ప్రతి గదిలో కూడా గోమాతను తిప్పుతారు.  అంతే కాదు.. ఇంట్లో వ్రతాలు చేస్తున్నా... శుభకార్యాలు జరుగుతున్నా.. గోమయంతో అలుకుతారు.. గో పంచకంతో శుద్ది చేస్తారు. 

జన్మనిచ్చిన తల్లి పాలిచ్చి పెంచితే... జన్మమంతా అమృతం లాంటి పాలనిచ్చి కోట్లాది మందికి జీవనాధారంగా నిలిచే పరమ పవిత్రమైన మూగజీవి మన గోమాత. శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా కొలిచి, కాపాడిన గోపాలన దినమే ఈ గోపాష్టమి.ఈ పవిత్ర గోపాష్టమి రోజున గోమాతను పూజించాలని పండితులు చెబుతున్నారు. 

గోపాష్టమి..పురాణ కథ

 స్కాంద పురాణం ప్రకారం ద్వాపర యుగంలో చిన్ని కృష్ణుడు ఆరేళ్ల వరకు ఆవు దూడలను మాత్రమే మేపేవాడు.  ఇక నుంచి పెద్ద ఆవులను కూడా మేపుతానని తల్లి యశోద, తండ్రి నందుడి వద్ద మారాం చేశాడు. దీంతో నందుడు తమ కులగురువు శాండిల్య మహర్షిని ముహూర్తం అడిగాడు.ఆ మహర్షి పంచాంగం లెక్కించి "కార్తీక శుక్ల అష్టమి రోజు అత్యంత శ్రేష్ఠమైన ముహూర్తమని చెప్పినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. 

►ALSO READ | జ్యోతిష్యం:నెల రోజుల పాటు నవ పంచమయోగం.. 3 రాశుల వారికి దశ తిరిగిపోద్ది..!

 ద్వాపర యుగంలో కార్తీకమాసం శుక్ల పక్షం అష్టమి రోజు  శ్రీకృష్ణుడు మొదటిసారి గోపుడుగా మారి గోవులను అడవికి తోలుకెళ్లాడు. అందుకే ఈ తిథికి గోపాష్టమి అని పేరు వచ్చింది. అప్పటి నుంచే కృష్ణుడికి గోపాలుడు, గోవిందుడు అనే పేర్లు స్థిరపడ్డాయి. 

 


గోపాష్టమి పూజా విధానం

 
స్నానం, అలంకరణ:
ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. తర్వాత ఆవు, దూడలకు శుభ్రంగా స్నానం చేయించి, పూల మాలలు, పసుపు, కుంకుమ, గోటా తో అలంకరించాలి.
 తిలక ధారణ: గోవు నుదుటన పసుపు, కుంకుమ, చందనంతో బొట్టు పెట్టి, కొమ్ములకు పూలు అలంకరించాలి. కాళ్లకు నీళ్లు పోసి నమస్కరించాలి.

 పూజ, ఆరతి: గోవు ముందు ధూపం, దీపం వెలిగించి, శ్రీకృష్ణుడి ప్రతిమ పెట్టి పూజ చేయాలి. కృష్ణుడికి వెన్న, మీగడ నైవేద్యం పెట్టాలి. గోవు తోక భాగాన్ని స్పృశించి నమస్కరించాలి. గోవుకు వెనుక భాగం నుంచి కర్పూర హారతిని ఇవ్వాలి. 

 ప్రదక్షిణ: పూజ తర్వాత గోవుకు 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. గోవులో 33 కోటి దేవతలు ఉంటారు కాబట్టి ప్రదక్షిణ చేస్తే వారందరికీ ప్రదక్షిణ చేసినట్లే.

గోగ్రాసం: గోవుకు పచ్చగడ్డి, బెల్లం, అరటిపండ్లు, రోటీలు తినిపించాలి. గోవు తిన్న తర్వాతే మనం భోజనం చేయాలి. ఈ రోజు పాలు, పాల ఉత్పత్తులు తినకూడదు, ఎందుకంటే పాలు దూడ కోసమే వదిలేయాలి.

 గోశాలలో దానం: ఇంట్లో ఆవు లేని వారు దగ్గరలోని గోశాలకు వెళ్లి గడ్డి దానం చేయడం, గోశాల మట్టిని నుదుటన బొట్టుగా పెట్టుకోవడం వల్ల కష్టాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.


గోపాష్టమి రోజు( నవంబర్​ 17)  ఏం చేయకూడదు?

  • గోవును, దూడను తిట్టడం, కొట్టడం చేయకూడదు. 
  • తామసిక ఆహారం, మాంసం, మద్యం జోలికి వెళ్లకూడదు. 
  • వాదనలు, గొడవలకు దూరంగా ఉండాలి.
  •  గో సంరక్షణ, ప్రకృతి పట్ల కృతజ్ఞతను చాటే పర్వదినం

గోవులకు గోపాష్టమి రోజున పశుగ్రాసం, ఆకుపచ్చని బఠాణీలు, గోధుమలను ఆవుకు పెడితే.. సర్వాభీష్టాలు నెరవేరుతాయి. ఆవులో 33 కోట్ల దేవతలు కొలువైవుంటారు. గోవుకే మాత అనే హోదాను ఇచ్చారు. అలాంటి అమ్మలాంటి గోమాతను పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.