- ఆ భాగాన్ని నేను, ప్రియాంక కలిసి రాశాం
- అమ్మ నాలుగుసార్లు క్యాన్సర్‌ను జయించింది
- నాన్న ఒడిలో కూర్చొనే అమ్మ భోజనం చేసేది
- మమ్మీ.. నిన్ను చూసి నాన్న ఎంతో గర్వపడేవారు
- సోనియా ఆత్మకథ ఆవిష్కరణలో రాహుల్
న్యూఢిల్లీ: తండ్రి రాజీవ్ గాంధీ మరణం తర్వాత తల్లి సోనియా జీవితం, వ్యక్తిత్వం శాశ్వతంగా మారిపోయాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భావోద్వేగంతో చెప్పారు. ‘అమ్మ జ్ఞాపకశక్తి అద్భుతం. ఆమె ఏదీ మర్చిపోదు.. ఒక్క విషయం తప్ప. నాన్న చనిపోయిన రోజు ఏం జరిగిందో అమ్మకు అసలు గుర్తులేదు. ఆ విషాదాన్ని ఆమె మెదడు పూర్తిగా మర్చిపోయింది. పుస్తకంలో మీరు చదివే ఆ భాగాన్ని నేను, ప్రియాంక కలిసి కూర్చి రాశాం’ అని వెల్లడించారు.
సోమవారం ఢిల్లీలో సోనియా ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ అధికారిక ఆవిష్కరణ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. వేదికపై రాజకీయాలు మాట్లాడొద్దని తనకు కఠిన ఆదేశాలు ఉన్నాయని చెబుతూనే, ఓ కొడుకుగా తల్లిదండ్రుల మధ్య ఉన్న అపురూప ప్రేమను, నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. తన తల్లి నాలుగుసార్లు క్యాన్సర్‌ను జయించారని, రెండు, మూడుసార్లు కాదని చెప్పారు. ‘అమ్మ వాటన్నింటినీ చిన్నవిగా చేసి చెబుతుంది. నా జీవితంలో ఒక్కసారి కూడా ఆమె భయపడటం గానీ, వెనక్కి తగ్గడం గానీ చూడలేదు. మమ్మీ.. పాపా నిన్ను ప్రేమించారు. కానీ నిన్ను చూసి ఆయన ఎంత గర్వపడేవారో నేను చెప్పలేను’ అన్నారు.
ఒక్కరోజులో కొత్త అమ్మ వచ్చింది
పుస్తకం పేరు వెనుక ఉన్న భావాన్ని వివరిస్తూ.. ‘నాన్న మాయమయ్యాక అమ్మ మరో ప్రయాణం మొదలుపెట్టింది. అప్పటిదాకా సరదాగా, ఎప్పుడూ నవ్వుతూ ఉండే మా అమ్మ ఒక్కరోజులో మాయమైంది. ఆమె స్థానంలో కొత్త అమ్మ వచ్చింది. ఎందుకంటే ఆమె జీవితంలోని వెలుగు ఆరిపోయింది’ అని రాహుల్ అన్నారు. ముందు నానమ్మ ఇందిరను తుపాకీ తూటాలకు, తర్వాత తమ అతిపెద్ద అండ నాన్నను బాంబు దాడిలో కోల్పోయామని గుర్తుచేసుకున్నారు. అందరూ అమ్మను అంతర్ముఖి అనుకుంటారని, కానీ నానమ్మ చనిపోయే దాకా ఆమె ఎవరితోనైనా ఏదైనా మాట్లాడే మనిషని చెప్పారు. ఆ తర్వాత దేశ ప్రజలనే కొత్త తలుపు తెరుచుకుందని, గ్రామాల్లోని లక్షలాది మంది ‘నువ్వు మా దానివి’ అంటూ ఆమెను అక్కున చేర్చుకున్నారని అన్నారు.
నాన్న ఒడిలో అమ్మ
తల్లిదండ్రుల అన్యోన్యతపై రాహుల్ చెప్పిన సరదా జ్ఞాపకాలు సభలో నవ్వులు పూయించాయి. ‘లంచ్ అయినా, డిన్నర్ అయినా భోజనం చేసే ప్రతిసారీ నాన్న ఒడిలో అమ్మ కూర్చునేది. అందరి ఇండ్లలో ఇలాగే ఉంటుందని అనుకునేవాణ్ని. స్నేహితుల ఇండ్లకు వెళ్లినప్పుడు వాళ్ల అమ్మానాన్న అలా కూర్చోకపోతే.. ఏంటిది, మీ అమ్మ మీ నాన్న ఒడిలో ఎందుకు కూర్చోలేదని అడిగేవాణ్ని’ అంటూ నవ్వుతూ చెప్పారు. ‘అమ్మానాన్న వాదించుకోవడం చూశాం కానీ, గొడవపడటం జీవితంలో ఒక్కసారే చూశాం’ అని అన్నారు.
‘వర్సిటీ’లో చికెన్ వద్దు
తన తల్లిదండ్రుల ప్రేమకథ కేంబ్రిడ్జ్‌లోని ‘వర్సిటీ’ రెస్టారెంట్లో మొదలైందని, ఏండ్ల తర్వాత కేంబ్రిడ్జ్‌లో ఉన్నప్పుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఆ రెస్టారెంట్‌కు వెళ్లానని రాహుల్ చెప్పారు. ‘పసుపు రంగు తలుపు ఇంకా గుర్తుంది. మా అమ్మానాన్న ఇక్కడే కలిశారని చెప్పగానే అక్కడి వ్యక్తి.. వాళ్లిద్దరూ నాకు బాగా తెలుసు అన్నాడు. మెనూలో ఏది బాగుంటుందని అడిగితే చికెన్ షాస్యూర్ అన్నాడు. ప్రేమలో పడాలంటే వర్సిటీ రెస్టారెంట్‌కు వెళ్లండి, కానీ చికెన్ షాస్యూర్ మాత్రం తినకండి.. అది భయంకరంగా ఉంటుంది’ అనడంతో సభలో నవ్వులు పూశాయి.
