• టీచర్ల వ్యక్తిగత పేర్లపై కనెక్షన్లే సమస్యకు కారణం
• ఒకే ఐడీపై రెండో ఈ-కేవైసీకి అవకాశం లేక సిలిండర్ల డెలివరీ బంద్
• పోషకాహారానికి దూరమవుతున్న చిన్నారులు, ఆరోగ్యలక్ష్మి లబ్ధిదారులు
హైదరాబాద్, వెలుగు: వంటగ్యాస్ ఈకేవైసీ నిబంధనతో రాష్ట్రంలోని వేలాది అంగన్వాడీ కేంద్రాల్లో గత రెండు వారాలుగా వంటలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 35,781 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులతో పాటు ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలకు అందాల్సిన వేడివేడి పోషకాహారం అందడం లేదు. చాలా చోట్ల మధ్యాహ్నం పిల్లలను భోజనం కోసం ఇళ్లకు పంపిస్తుండగా, మరికొన్ని చోట్ల తల్లిదండ్రులే క్యారియర్లలో భోజనం పంపుతున్నారు. కూలి పనులకు వెళ్లే నిరుపేద తల్లిదండ్రులు పిల్లలకు అన్నం పెట్టేందుకు పనులు వదిలి ఇంటికి రావాల్సి వస్తున్నది. సమస్య ఏర్పడి రోజులు గడుస్తున్నా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
టీచర్ల ఐడీలతోనే అసలు చిక్కు..
గతంలో అంగన్వాడీ కేంద్రాల పేరిట ప్రత్యేకంగా ఇనిస్టిట్యూషనల్ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయకపోవడంతో టీచర్లు తమ వ్యక్తిగత పేర్ల మీద కనెక్షన్లు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లకు ఈకేవైసీ తప్పనిసరి చేయడంతో సమస్య మొదలైంది. ఒక కస్టమర్ ఐడీపై ఒక కనెక్షన్ కు మాత్రమే ఈకేవైసీ చేసే అవకాశం ఉండటంతో టీచర్లు తమ ఇంటి కనెక్షన్లకు ఈకేవైసీ చేయించుకున్నారు. దీంతో అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ సరఫరాను ఏజెన్సీలు నిలిపివేశాయి. ఫలితంగా మెనూ ప్రకారం అందించాల్సిన అన్నం, పప్పు, ఆకుకూరలు, సాంబారు, ఉడికించిన కోడిగుడ్లు, 200 మిల్లీలీటర్ల పాలు ఇవ్వలేకపోతున్నారు. కొందరు టీచర్లు ఇళ్లలోనే గుడ్లు ఉడికించి తెస్తున్నా.. ఇతర వంటలు చేయలేకపోతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ప్రత్యామ్నాయ ఆదేశాలు రాకపోవడంతో ఇబ్బందులు కొనసాగుతున్నాయి.
తక్షణ పరిష్కారానికి డిమాండ్..
రాష్ట్రంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య 40 వేలకు పైగా ఉన్నట్లు జాతీయ లెక్కలు చెబుతున్నాయి. అంగన్వాడీల ద్వారా పోషకాహారం అందించి ఈ సమస్య తీవ్రతను తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈకేవైసీ సమస్యతో చిన్నారులు పోషకాహారానికి దూరమవుతున్నారు. భోజనం అందకపోవడంతో కొన్ని జిల్లాల్లో ఇప్పటికే తక్కువగా ఉన్న పిల్లల హాజరు మరింత తగ్గే ప్రమాదం ఉంది. తొలిముద్ద ఉదయం అల్పాహార కార్యక్రమానికి కూడా ఆటంకం కలుగుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇరుకు గదుల్లో కట్టెల పొయ్యిలు వాడితే పొగ, అగ్నిప్రమాదాల ముప్పు ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యంతో ముడిపడిన ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టీచర్ల వ్యక్తిగత పేర్లపై ఉన్న గ్యాస్ కనెక్షన్లను అంగన్వాడీ కేంద్రాల పేరిట ఇనిస్టిట్యూషనల్ కనెక్షన్లుగా మార్చి నిరంతరాయంగా గ్యాస్ సరఫరా చేయాలని కోరుతున్నాయి.
గ్యాస్ అయిపోయి పదిరోజులైంది..
గతంలో నా పేరు మీదే అంగన్వాడీ సెంటర్ కు గ్యాస్ రిజిస్ట్రేషన్ చేయించా. ఇప్పుడు ఈకేవైసీ తప్పనిసరి చేయడంతో నా ఇంటి కనెక్షన్ కు చేయించుకున్నాను. రెండోసారి ఈకేవైసీకి అవకాశం లేక గ్యాస్ ఇవ్వడం లేదు. పది రోజుల నుంచి సెంటర్ లో వంట చేయడం లేదు. పిల్లలు భోజనం కోసం ఇంటికి వెళ్లి తిని వస్తున్నారు.
- ఓ అంగన్వాడీ టీచర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా..
సెంటర్ లో గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో తెలియదు. ఈకేవైసీ పూర్తి చేస్తేనే సిలిండర్ డెలివరీ చేస్తామని గ్యాస్ ఏజెన్సీ వాళ్లు అంటున్నారు. గ్యాస్ అయిపోయాక పిల్లలకు ఎలా వండి పెట్టాలో అర్థం కావడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ప్రత్యామ్నాయం ఏమీ చెప్పలేదు.
- మరో అంగన్వాడీ టీచర్
