హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‎లో అత్యాధునిక పోస్ట్ ప్రొడక్షన్ కేంద్రం

హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‎లో అత్యాధునిక పోస్ట్ ప్రొడక్షన్ కేంద్రం

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లో తన విస్తరించిన అత్యాధునిక పోస్ట్ ప్రొడక్షన్ కేంద్రాన్ని ప్రారంభించేందుకు ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్ సిద్ధమైంది. కొత్త కేంద్రంలో సుమారు 25 ప్రత్యేక స్టూడియో సూట్లు ఉంటాయి. కలర్ గ్రేడింగ్, డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్, సౌండ్ డిజైన్, ఎడిటింగ్ వంటి సేవలు ఒకే చోట పొందవచ్చు. హైదరాబాద్‌‌‌‌లోనే అతిపెద్ద కలర్ గ్రేడింగ్ సూట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులో హెచ్‌‌‌‌డీఆర్ బై బార్కో సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు.  

తెలంగాణలో ఈ తరహా ప్రత్యేక సదుపాయం ఇదే మొదటిదని సంస్థ తెలిపింది.  డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్, ఆధునిక ఎడిటింగ్ సూట్లు, ప్రివ్యూ థియేటర్లూ ఉన్నాయి. పెద్ద సినిమాలతో పాటు ప్రాంతీయ చిత్రాలు, స్వతంత్ర సినిమాలు, ఓటీటీ కంటెంట్, టెలివిజన్, ప్రకటనల నిర్మాణ సంస్థలకు ఈ కేంద్రం సేవలు అందించనుంది. సాంకేతిక నిపుణులు, కళాకారులకు ప్రత్యేక విశ్రాంతి గదులు, లాంజ్‌‌‌‌లు కూడా ఏర్పాటు చేశారు.